లెజెండ్రీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మి (86) నేడు ఆదివారం తుదిశ్వాస విడిచారు. తన భర్త కె విశ్వనాథ్ మరణించిన 24 రోజుల్లోపే ఆమె కూడా  శివైక్యం చెందారు.

లెజెండ్రీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మి (86) నేడు ఆదివారం తుదిశ్వాస విడిచారు. తన భర్త కె విశ్వనాథ్ మరణించిన 24 రోజుల్లోపే ఆమె కూడా శివైక్యం చెందారు. దీనితో విశ్వనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

గత కొంతకాలంగా జయలక్ష్మి కూడా అనారోగ్యంతోనే ఉన్నారు. దీనితో కుటుంబ సభ్యులు ఆమెకి అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. నేడు ఆమె ఆరోగ్యం విషమం కావడంతో సాయంత్రం 6.15 గంటలకు కన్నుమూశారు. 

కె విశ్వనాథ్ మరణించిన ఎమెర్జెన్సీ వార్డులోనే జయలక్ష్మి కూడా ప్రాణాలు వదిలారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. దీనితో మరణంలోనే ఈ దంపతులు అదే బంధం చూపించారని భావిస్తున్నారు.

జయలక్ష్మి అంత్యక్రియలని సోమవారం పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు కాశీనాథుని రవీంద్ర నాథ్, నాగేంద్ర నాథ్, పద్మావతి దేవి ముగ్గురు సంతానం. 24 రోజుల వ్యవధిలో తల్లి దండ్రులు ఇద్దరూ దూరం కావడంతో కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నెలకొని ఉంది. 

కె .విశ్వనాధ్ ఫిబ్రవరి 2న అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు విశ్వనాధ్ గారి ఇంటికి ఎప్పుడు వెళ్లినా.. వారిని ఈ దంపతులు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు. చిరంజీవి, కమల్ హాసన్, త్రివిక్రమ్ లాంటి ప్రముఖులకు కె విశ్వనాథ్ గారి కుటుంబంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.