ఆశ్చర్యం :మరణంలోనూ ‘శంకరాభరణం’వీడని విశ్వనాథుడు
‘శంకరాభరణం’ 1980 ఫిబ్రవరి 2న విడుదలై మెల్లగా మౌత్ టాక్ తో మంచి పేరు సంపాదించి, ఆ యేడాది అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలచింది.

మరణంలోనూ ‘శంకరాభరణం’వీడని విశ్వనాథుడు
సరిగ్గా 43 ఏళ్ల క్రితం 1980 ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రోజున కె.విశ్వనాథ్(92) కన్నుమూశారు. తన కెరీర్ ని అద్భుతమైన స్టేజీకి తీసుకెళ్లిన సినిమా విడుదలైన రోజే కళాతపస్వి కన్నుమూయడం నిజంగా ఒక విశేషంగా చెప్పాలి.
దర్శకుడుగా కె. విశ్వనాథ్ ఎన్ని చిత్రాలు రూపొందించినా, ఆయనకు ‘కళాతపస్వి’ అన్న పేరును సంపాదించి పెట్టింది ‘శంకరాభరణం’ చిత్రము. ఈ సినిమాను 1979లోనే పూర్తిచేశారు. అవార్డులకు కూడా ఆ తేదీతోనే పంపించారు. రాష్ట్ర, కేంద్రప్రభుత్వ అవార్డులు వచ్చాయి. అయితే ఆ సినిమాను చూసి డిస్ట్రిబ్యూటర్స్ మొదట పెదవి విరిస్తూవచ్చారు. చివరకు ‘శంకరాభరణం’ 1980 ఫిబ్రవరి 2న విడుదలై మెల్లగా మౌత్ టాక్ తో మంచి పేరు సంపాదించి, ఆ యేడాది అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలచింది.
పాశ్చాత్య సంగీత పెనుతుపాను తాకిడికి రెపరెపలాడిపోతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని చేతులొడ్డి కాపాడుకోవాలనే సంకల్పాన్ని కలిగించే అద్భుతమైన దృశ్య పరంపర ‘శంకరాభరణం’సొంతం. అందుకే అది జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాదు, 1981లో ఫ్రాన్స్‌లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రేక్షకుల ప్రత్యేక అవార్డును కూడా అందుకుంది. అన్నింటికన్నా తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది!
మొదట కొన్ని కేంద్రాలలో కేవలం ఉదయం ఆటలతోనే ప్రదర్శితమైన ‘శంకరాభరణం’ తరువాత రెగ్యులర్ షోస్ తో శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. తమిళనాడు, కేరళలలోనూ ‘శంకరాభరణం’ ఘనవిజయం సాధించింది. దేశవిదేశాల్లో జయకేతనం ఎగురవేసింది. అంతటి చరిత్రను విశ్వనాథ్ కు సొంతం చేసిన ‘శంకరాభరణం’ విడుదలైన ఫిబ్రవరి 2వ తేదీనే ఆయన కూడా తనువు చాలించడం దైవికం అనే చెప్పాలి. ‘శంకరాభరణం’ 43ఏళ్లు పూర్తిచేసుకున్న రోజున విశ్వనాథ్ చివరి శ్వాస విడిచారు. విశ్వనాథ్ ను కళాతపస్విగా నిలిపిన ఫిబ్రవరి 2వ తేదీనే ఆయన తనువు చాలించారన్నది విశేషం!