తెలుగు బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ ఈ షో కోసం భారీ రెమ్యునరేషన్ ముట్టజెప్తున్న స్టార్ మా టీవీ ఎన్టీఆర్ కు 25 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వనున్న మా టీవీ

జాతీయ స్థాయిలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఇప్పటికే క్రేజీ రియాలిటీ షోగా మారిన బిగ్‌బాస్ షోను తెలుగులో ఎన్టీఆర్ చేస్తుండటంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షోను చేయడానికి ఎన్టీఆర్ ఎంత తీసుకొన్నారు? స్టార్ మా టెలివిజన్ ఎన్టీఆర్‌ను ఈ షో కోసం ఒప్పించడానికి ఏ మేరకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారనే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం దక్షిణాదిలో ఏ హీరో తీసుకోనంత మొత్తాన్ని ఈ షో కోసం తీసుకొన్నాడనేది సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం జై లవకుశ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వయంగా ఆయన సోదరుడు, నటుడు కల్యాణ్ రామ్ నిర్మించడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ రికార్డు స్థాయిలో యూట్యూబ్‌లో మోత మోగిస్తున్నది. ఇలాంటి స్టార్ స్టాటస్ ఉన్న యంగ్ టైగర్ బుల్లితెర మీద కనిపించడానికి తక్కువ మొత్తంలో తీసుకోడనేది టాక్. అయితే బిగ్‌బాస్ లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాత్రం తన రెమ్యూనరేషన్‌పై కొంత క్లారిటీ ఇచ్చాడు. తన భార్య, బిడ్డలకు సరిపోయేంత అని చెప్పుకొచ్చారు. అంటే ఆయన భార్య బిడ్డలు తక్కుమ మొత్తానికి సంతృప్తి పడరని అర్థమైపోయింది. ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానమిస్తూ మీరు అనుకునేంత మాత్రం కాదు అని చెప్పారు. మీరు ఇలా అడుగుతుంటే నాకు ఎంత ఇచ్చారో అనే విషయాన్ని ఇంటికి వెళ్లి ఆలోచించాలి అని అన్నారు. ఇలా తన రెమ్యునరేషన్‌పై ఎన్టీఆర్ చాలా తెలివిగా దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ తెలుగు హీరోలకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్ ఇచ్చారనేది ఇన్‌సైడ్ టాక్.

బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ రియాలిటీ షో కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసుకొన్న పారితోషికం అనధికారికంగా సుమారు రు.25 కోట్లు మొత్తం ఉండవచ్చనేది తాజా సమాచారం. ఈ మొత్తం ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ, తక్కువ ఉండటానికి అవకాశం లేదని పలువురు బల్లగుద్ది చెప్తున్నారు. ఎన్టీఆర్ తీసుకొన్న రెమ్యునరేషన్ మాత్రం ఇండస్ట్రీ ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్నదనే విషయం ఫిలింనగర్ విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

ప్రస్తుతం జై లవకుశ షూటింగ్ నిరవధికంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతున్నది. అయితే బిగ్‌బాస్ కోసం ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్‌ను మహారాష్ట్రలోని పుణెలో చేయాలని నిర్ణయించారు. ముంబైకి సమీపంలోని లోనావాలాలో ఏర్పాటు చేసిన బిగ్‌బాస్ సెట్ పుణేకు దగ్గరగా ఉండటమే అందుకు కారణమని తెలుస్తున్నది. బిగ్‌బాస్ కోసం వారంలో రెండు రోజులు అంటే శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ వెళ్తారు. ఈ క్రమంలో వీలుగా ఉండేందుకు తన షూటింగ్‌ను లోనావాలాకు దగ్గరగా ప్లాన్ చేసుకొన్నట్టు తెలుస్తున్నది. జులై 15 నుంచి షో టీవీలో ప్రసారం కానుంది.