జూనియర్ ఎన్టీఆర్ గత జన్మ వివరాలు వెల్లడించిన ఆస్టాలజర్ నాగనాథ్ సెలెబ్రిటీల గత జన్మ రహస్యాలు చెప్తూ యూట్యూబ్ చానల్‌ కార్యక్రమం గత జన్మలో ఎన్టీఆర్ గిరిజన యోధుడట..ఇంకా చాలా ఉంది.. 

గత జన్మ, మరు జన్మ అంటూ ఉందో లేదో గానీ.. ప్రతి వ్యక్తికి సంబంధించిన గత జన్మ రహస్యమేంటో తాను చెబుతానంటున్నారు ఎస్వీ నాగనాథ్ అనే ఆస్ట్రో సైకాలజిస్ట్. ప్రతి సెలెబ్రిటీకి చెందిన గత జన్మ గురించి చెబుతానంటున్నాడు. ఓ యూట్యూబ్ చానల్‌లో ప్రసారమవుతున్న ఓ కార్యక్రమంలో ఆయన సెలెబ్రిటీల గత జన్మ రహస్యాలను చెబుతున్నాడు. తాజాగా జరిగిన కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గత జన్మ విశేషాలను వివరించాడు. మరి, గత జన్మలో ఎన్టీఆర్ ఎలా ఉండేవారు..? ఆయన మనస్తత్వమేంటి..? అంటే.. ఎన్టీఆర్ ఓ ‘గిరిజన యోధుడు’ అని చెప్పాడు. ఎన్టీఆర్ గత జన్మలో ఎలా ఉండేవారో ఆయన మాటల్లోనే...

‘‘అందరినీ ఉత్తేజ పరిచే.. ఉల్లాస పరిచే గ్రహ స్థితి ఎన్టీఆర్‌ది. దక్షిణ భారతదేశంలోనే ఆయన జన్మించారు. గిరిజనుడిగా పుట్టారు. పూర్తి గిరిజన వాతావరణంలోనే పెరిగారు. ఆయన ఓ గిరిజన యోధుడు. ఆయనకు తెలిసినవే రెండే. ఒకటి శత్రువులను సంహరించడం. రెండోది తనకు దాసోహమైన వాళ్లను రక్షించడం. శరీరబలాన్ని, అధికారాన్ని మాత్రమే విశ్వసించి ముందుకు వెళ్లే యోధుడు. బుద్ధిబలాన్ని ఆయన ఉపయోగించడం చాలా తక్కువ. ఎందుకంటే.. ఆయన పుట్టింది అరణ్యంలో. కాబట్టి.. ప్రతి క్షణం భద్రంగా ఉండాలనే ఆలోచన. జీవితాలపై నమ్మకం లేని స్వభావం. ఎప్పుడు..ఏం జరుగుతుందో నమ్మకం లేని ఆలోచనలతోనే ఆయన బాల్యం అంతా గడిచింది. శత్రువులను తుదముట్టించడంలో అన్ని సార్లు ఆయన సఫలమయ్యారు. ఆయన తన ధైర్యంతోనే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు’’ అని చెప్పారు.

‘‘పూర్వజన్మలో ఎన్టీఆర్‌కున్న ఓ గొప్ప వరం ‘గురువు’. ఆయనకు గురువే దైవం. ఆయన గుడ్డిగా నమ్మింది కేవలం గురువునే. గురువు తర్వాత ఆయన తన కండ బలాన్ని, తనలోని ఆవేశాన్ని, క్రమశిక్షణను, భావోద్వేగాలనే నమ్ముకున్నారు. ఇక, బాల్యం నుంచే ఆయన ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాని వల్ల ఆయన శారీరకంగా దృఢత్వం సంపాదించారు. మేష లగ్నంలో జన్మించారు. ఇప్పుడంటే ఆయన ఎత్తు తక్కువున్నారు కానీ.. అప్పుడు ఆరడుగుల ఆజానుబాహుడు. ఆయన తేజస్సు, అపారమైన ముఖ వర్చస్సు కలిగిన వ్యక్తి. అంటే పూర్వజన్మలో ఓ అద్భుతమైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఆయన కిల్లింగ్ ఇన్‌స్టింక్ట్ (శత్రు సంహారం), పోరాటపటిమ, సాధించితీరాలనే తపన ఆయన సొంతం. ఆయన ఎంత కఠినంగా ఉన్నా.. జంతువులపై మాత్రం చాలా ప్రేమను కనబరిచేవారు. జంతువుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని అనుకుంటాడే తప్ప.. వాటిని చంపాలనుకునే స్వభావం కాదు. ఆయన జంతు స్వభావాన్నే నమ్ముతారు’’ అని నాగ్‌నాథ్ తెలిపారు.

‘‘మనిషి స్వభావాన్ని జూనియర్ నమ్మరు. ఎందుకంటే.. మనిషి బుద్ధి, దురాశ ఎప్పటికైనా మనల్ని నిర్వీర్యం చేయొచ్చు అనే ఆలోచన ఆయనది. ఆయన తన జీవితం మొత్తంలో ఆవేశాన్ని తప్ప.. బుద్ధిని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆయన ఉన్నారంటే తన స్నేహితులు, తనను విశ్వసించేవారికి భద్రత ఉన్నట్టే. అంత విశ్వసనీయతను కలిగి ఉన్నారు. శత్రువులకు మాత్రం ఆయనంటే భయమే. ఆయన్ను చాలా దగ్గరి నుంచి చూసిన ఆంతరంగికులు చెప్పే మనస్తత్వం ఒకలా ఉండేది. దూరం నుంచి చూసిన వాళ్లు చెప్పే వ్యక్తిత్వం మరోలా ఉంటుంది. ఆయన వాక్ గ్రహ బలం బలహీనంగానే ఉంది. ఏదైనా సరే మాటలతో గానీ, కారణాకారణాలు చెప్పిగానీ చేసే మనస్తత్వం కాదు. ఏదైనా మౌనంగా వింటారు. అర్థం చేసుకుంటాడు. కానీ, తన భావాలను మాత్రం వ్యక్తం చేయరు. భావ వ్యక్తీకరణ చేయలేని లగ్నంలో ఆయన జన్మించారు. భావ వ్యక్తీకరణ వల్లే వ్యక్తుల గుణాగణాలు, సున్నితత్వం అనేవి అర్థం చేసుకోగలుగుతారు. కానీ, వాటన్నిటికీ ఆయన అతీతుడు. కాబట్టి ఆయన్ను అందరూ కఠినుడు అనే అనుకునేవారు’’ అని చెప్పారు.

‘‘ఆయన జీవితాంతం తన ధైర్య సాహసాలతోనే జీవించారు. ఆయన ఆ వ్యక్తిత్వమే చాలా మందిలో స్ఫూర్తి నింపి యోధులను తయారు చేసింది. అంతేకాదు.. అలాంటి యోధులను ఆయనెప్పుడూ ప్రోత్సహించేవారు. అయితే ఓ యోధుడు ప్రపంచాన్ని జయించగలడేమో కానీ.. తన ఆలోచనలను మాత్రం గెలవలేడు. ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరిగింది. కనిపించని శత్రువుతో ఆఖరి రోజుల్లో యుద్ధం చేశాడు. తన వల్ల బాధపడిన వారిని, ఆవేశంలో చేసిన పనులనే ఆయన ఎక్కువగా తలచుకున్నారు. చివరి రోజుల్లో ఆయన మానసికంగా నిర్వీర్యమై ఒంటరి జీవితం గడిపారు. చివరి రోజుల్లో తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన గురువు గారికి దూరమవడం.. కొన్నికొన్ని సార్లు గురువు ఆజ్ఞలను పాటించకపోవడం వంటి వాటిని తలచుకుని మానసికంగా కుంగిపోయారు. ఎంత యోధుడిగా జీవితాన్ని గడిపారో.. అంత కుంగిపోయారు. అలా కుంగిపోయినప్పుడే.. ఆయన్ను శత్రువులు అంతమొందించారు’’ అని ఎన్టీఆర్ గత జన్మ రహస్యాలను చెప్పారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగ్‌నాథ్.