కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతోన్న యంగ్ డైరెక్టర్ అట్లీ ఇప్పటికే విజయ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేశాడు. ప్రస్తుతం అట్లీ.. విజయ్ హీరోగా 'బిగిల్' అనే సినిమా తీస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'తేరి', 'మెర్సల్' సినిమాలు సూపర్ హిట్ కావడంతో 'బిగిల్' సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత అట్లీ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. చాలా కాలంగా అట్లీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.

ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఎలానూ ఎన్టీఆర్ కి తమిళంలో సినిమా చేయాలనే ఆశ ఉండడంతో బైలింగ్యువల్ సినిమా ఉంటుందని భావించారు. మధ్యలో మురుగదాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు కోలీవుడ్ లో అట్లీ తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత అట్లీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా  ఉంటుందని అంటున్నారు. మరి ఈ విషయంపై అటు అట్లీ కానీ ఇటు ఎన్టీఆర్ కానీ స్పందిస్తారేమో చూడాలి!