బిగ్ బాస్ సీజన్1 కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీఆర్ ఇప్పుడు సీజన్ 2 లో అతిథిగా కనిపించబోతున్నాడని సమాచారం. 16 మంది పోటీదారులతో మొదలుపెట్టిన ఈ రియాలిటీ షో 106 రోజుల పాటు కొనసాగనుంది. ఇప్పటికే సంజన, నూతన్ నాయుడు ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 కాస్త డల్ గా సాగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ షోని మరింత రసవత్తరంగా నడిపించడానికి నిర్వాహకులు కాస్త డోస్ పెంచబోతున్నారు. ఈ క్రమంలో తారక్ ను హౌస్ లోకి గెస్ట్ గా పంపించబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సీజన్ కూడా తారక్ హోస్ట్ చేయాల్సివుంది కానీ తనకున్న కమిట్మెంట్ల కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు కనీసం ఒకరోజు అతిథిగా కనిపించాలని రిక్వెస్ట్ చేశారట.

దీంతో తారక్ కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. కానీ తారక్ ఏరోజు కనిపిస్తాడనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు. ఈ షో మొదలైన మొదటి ఎపిసోడ్లోనే నాని సరదాగా 'నాకు వంట రాదు కావాలంటే తారక్ ను ఒకరోజు హౌస్ కు ఇన్వైట్ చేద్దాం' అంటూ కామెంట్ చేశాడు. మరి నిజంగానే తారక్ వచ్చి మరోసారి వంట చేస్తాడేమో చూడాలి!