దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఇద్దరు టాప్‌ స్టార్లతొ భారీ మల్టీ స్టారర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు జక్కన్న. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతానికి పైగా పూర్తయినట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాను జనవరి 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే లాక్ డౌన్‌ కారణంగా అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో ఇప్పుడు రిలీజ్ అనుకున్న సమయానికి  సినిమా రిలీజ్‌ చేసే పరిస్థితి కనిపించటం లేదు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టైటిల్‌ లోగోతో పాటు రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఓ టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే అదే రోజు ఎన్టీఆర్ బర్త్‌ డేకు ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ టీజర్ వస్తుందని అంతా భావించారు.

అయితే నందమూరి అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లింది ఆర్‌ ఆర్‌ ఆర్‌ టీం. లాక్‌ డౌన్‌ ఎక్స్‌టెండ్ కావటంతో ఎన్టీఆర్ టీజర్‌కు సంబంధించిన వర్క్ పూర్తి చేయలేకపోయామని వెల్లడించింది ఆర్‌ఆర్ఆర్‌ టీం. `ఎన్టీఆర్‌ పుట్టిన రోజున క్యారెక్టర్‌ టీజర్‌ రిలీజ్‌ చేసేందుకు మేం చాలా ప్రయత్నించాం. కానీ అనుకున్నట్టుగా ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ గానీ, పోస్టర్‌ గానీ రిలీజ్ చేయలేకపోతున్నాం. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టుగా ఏది రిలీజ్ చేసే ఉద్దేశం మాకు లేదు. మీ నిరీక్షణకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరు మెచ్చే టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తాం` అంటూ ట్వీట్ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. దీంతో ఎన్టీఆర్‌ బర్త్‌డేకి అద్దిరిపోయే టీజర్‌ కన్ఫామ్‌ అని అభావిస్తున్న నందమూరి అభిమానులు ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయారు.