జూనియర్ ఎన్టీఆర్ ని అందరూ ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. ఇక అభిమానులు అతడిని నిజమైన టైగర్ అంటే మన హీరోనే అని మురిసిపోతుంటారు. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు రాజమౌళి భారీ సీన్ ఒకటి ప్లాన్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే కొమరం భీమ్ అడవిలో ఉండే రోజుల్లో కొన్ని సన్నివేశాలను చూపిస్తున్నారు. అక్కడ పులితో ఫైట్ చేసే సీన్ ఒకటి క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ మంచి ఫైట్ ని విజువలైజ్ చేసి చూపించబోతున్నారట.

ప్రస్తుతం చిత్రయూనిట్ బల్గేరియాలో ఉంది. అక్కడే ఈ ఫైట్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం విదేశీ నిపుణుల టీమ్ పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. నిజంగానే సినిమాలో మాత్రం పులితో ఎన్టీఆర్ ఫైట్ ఉంటే దాన్ని ఫ్యాన్స్ మరింత ఎంజాయ్ చేస్తారు.

ఈ సినిమాలో అలియాభట్.. రామ్ చరణ్ కి జోడీగా కనిపించనుంది. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా విడుదల చేయనున్నారు.

అన్ని భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిర్మాత డీవీవీ దానయ్య రూ.400 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించనున్నారు.