హెలికాప్టర్‌ జంపింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగా జోజు జార్జ్‌ ఎడమకాలికి గాయమైనట్లు తెలిసింది. 


కమల్‌హాసన్‌ హీరోగా చాలా కాలం తర్వాత దర్శకుడు మణిరత్నం (Mani Ratnam)డైరక్షన్ లో చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్‌ (Joju George) కీలకపాత్రలో నటిస్తారు. తాజాగా ఈ సినిమా సెట్‌లో ప్రమాదం జరగ్గా అందులో ఆయన గాయపడ్డారు.

ప్రమాద వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ‘థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌ పుదుచ్చేరిలో జరుగుతోంది. హెలికాప్టర్‌లో జరిగే హైరిస్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదంలో జార్జ్‌ గాయపడ్డారు. వెంటనే ఆయన్ని చిత్ర టీమ్ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లు ఎడమపాదం ఫ్రాక్చర్‌ అయిందని కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో జోజు జార్జ్‌ లేని సీన్స్ ను షూట్ చేసే పనిలో పడింది మూవీ యూనిట్‌.

థగ్‌ లైఫ్‌ చిత్రంలో కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు, గౌతమ్‌ కార్తీక్‌, దుల్కర్ సల్మాన్‌, జయం రవి, ఐశ్వర్యలక్ష్మి, త్రిష వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వీరందరితో పాటు మాలీవుడ్ స్టార్ యాక్టర్‌ జోజు జార్జ్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను షూటింగ్​ జరుపుకుంటోందీ చిత్రం. 

‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) విషయానికొస్తే.. సముద్రపు దొంగల నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా పాన్‌ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కుతుంది. ‘నాయకన్‌’ లాంటి హిట్‌ తర్వాత కమల్‌హాసన్‌ - మణిరత్నం కాంబోలో 36 సంవత్సరాల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.