శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కి రైతుల నిరసనల సెగ తగిలింది. జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా షూటింగ్ కి రైతుల కారణంగా స్వల్ప విరామం ఏర్పడింది. ఇటీవల కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు నిరసనలు చేస్తున్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బ తీసే కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై రైతులకు మరియు ప్రభుత్వానికి మధ్య పలుమార్లు చర్చలు జరిగినా విఫలం కావడం జరిగింది. 

ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ నటిస్తున్న ఓ మూవీ షూటింగ్ పంజాబ్ లో జరుపుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు షూటింగ్ ప్రదేశానికి చేరుకొని అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా జాన్వీ పబ్లిక్ ప్రకటన చేయాలని, లేకుంటే షూటింగ్ జరగనీయమని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ మేరకు రైతు ఉద్యమానికి మద్దతుగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో స్పందించారు. 

అన్నం పెట్టే రైతులు దేశానికి గుండెకాయలాంటివారని, వాళ్లకు ప్రయోజనం చేకూరేలా త్వరలోనే పరిష్కారం దొరకాలని కోరుకుంటున్నాను అని ఆమె సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీనితో రైతులు షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోవడం జరిగింది. దేశంలోని సెలెబ్రిటీలు రైతులకు మద్దతులుగా నిలవాలని, మాట్లాడాలని వారు కోరుకుంటున్నారు.