ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' చిత్రంతో పాపులారిటీ సంపాదించాడు. తెలుగు వారికి కూడా ఆయన సుపరిచితుడే.. రీల్ లైఫ్ లో ఎలా ఉన్నా.. రియల్ లైఫ్ లో మాత్రం అతడొక నరరూప రాక్షసుడని అంటోంది అతడి మాజీ భార్య అంబర్ హియర్డ్.

కుటుంబ కలహాల నేపధ్యంలో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. గత రెండేళ్లుగా వీరి కేసు కోర్టులో నడుస్తోంది. జానీ డెప్ తన పట్ల ప్రవర్తించిన తీరుకి సంబంధించిన సాక్ష్యాలను అతడి భార్య అంబర్ కోర్టులో సమర్పించగా.. దానిలో కొన్ని విషయాలు బయటకి వచ్చాయి.

జానీ డెప్ బయటకి కనిపించేంత మంచివాడు కాదని, అతడి కారణంగా నేనొక బండరాయిగా అయిపోయానని అంబర్ తన వాంగ్మూలంలో పేర్కొంది. లాజ్ ఏంజిల్స్ లో తమ ఇంట్లో గొడవ జరుగుతున్న సమయంలో జానీ డెప్ తన ముఖంపై ఫోన్ విసిరి కొట్టాడని, తనను ఇష్టమొచ్చినట్లుగా పిడికిలి బిగించి కొట్టాడని అంబర్ పేర్కొంది.

దానికి సంబంధించిన ఫోటోలను కూడా బయటపెట్టింది. అయితే ఆమె సమర్పించినవి నిజమైన ఫోటోలు కాదని జానీ డెప్ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.