మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న రంగస్థలం  మూవీ ప్రస్థుతం చివరి పాట షూటింగ్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి సైరా మూవీ ఎఫెక్ట్ తో ఏడాదికి పైగా నిర్మాణంలోనే వుంది. ఈ మూవీ చివరి పాట పూర్తవ్వగానే గుమ్మడి కాయ కొట్టేసి ప్రమోషన్ మీద దృష్టి పెట్టనున్నాడు సుకుమార్. ప్రస్తుతం తీస్తున్న ఐటెం సాంగ్ కోసం ప్రత్యేకంగా పూజా హెగ్డేను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క పాట కోసమే పూజా అక్షరాల 75 లక్షల పారితోషికం తీసుకుందనే వార్త ఫిలిం నగర్ లో షికారు చేస్తోంది కాని నిజమని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇక సుకుమార్-దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో ఐటెం సాంగ్ అంటే ఎటువంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే. మరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మాస్ సినిమాలో ఇంకెంత కిక్కిచ్చే పాట ఉంటుందో అని ఫాన్స్ కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే అవుట్ పుట్ వస్తోందని యూనిట్ టాక్.

అ అంటే అమలాపురం - రింగ రింగ రింగా - ఇరవై నాలుగు ముప్పై ఆరు అంటూ వెర్రెక్కిపోయే హుషారు ట్యూన్స్ తో కేక పుట్టించిన దేవి శ్రీ ప్రసాద్ ఇందులో వాటిని మించిపోయే ట్యూన్ రెడీ చేసాడట. జిల్ జిల్ జిల్ రాణి-జిగేల్ రాణి-చేస్తావా బోణి అంటూ సాగే పాటలో ఒక పక్క పూజా హెగ్డే అందాలు మరో పక్క ముఠా మేస్త్రి స్టైల్ లో గళ్ళ లుంగీ పైకి కట్టేసి మోకాలి దాకా పొడవున్న నిక్కరుతో రామ్ చరణ్ వేసే స్టెప్స్ కి సినిమా హాళ్ళు విజిల్స్ తో హోరేత్తిపోవడం ఖాయం అంటున్నారు. సుకుమార్ కూడా అంతే స్పెషల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు టాక్. వింటేనే ఇంతగా ఊరుతోంది ఇంకా వెండితెర మీద ఏ రేంజ్ లో ఉంటుందా అని ఊహించుకోవడం మొదలు పెట్టారు మెగా ఫాన్స్.

గత మూడు సినిమాల్లో మాస్ హీరో పాత్రలు లేకుండా డిఫరెంట్ గా ట్రై చేసిన రామ్ చరణ్ ధృవతో మాత్రమే సక్సెస్ అందుకున్నాడు. దానికన్నా ముందు వచ్చిన బ్రూస్ లీ - గోవిందుడు అందరివాడేలే అంచనాలు అందుకోలేకపోవడంతో ఇంకాస్త కొత్తగా ట్రై చేసే ఉద్దేశంతో రంగస్థలం ఎంచుకున్నాడు.ఈ నెల చివరి వారంలో ఒక ఆడియో సింగల్ కాని లేదా ట్రైలర్ కాని విడుదల చేసే ఆలోచనలో ఉంది మైత్రి టీం.