మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కలిసి నటించబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీ ప్రధాన పాత్ర పోషించబోతుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.  

1999 కార్గిల్ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను గుంజన్ తన విమానంలో ఎక్కించుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించి అందరి మన్ననలు పొందింది. ఐఏఎఫ్ పైలట్ నడిపిన తొలి మహిళ ఆమె.

ఆమె జీవితం ఆధారంగా సినిమా తీయాలని కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్.. గుంజన్ పాత్రలో నటించనుండగా.. ఆమెకి జోడీగా దుల్కర్ కనిపించబోతున్నాడని టాక్. ఇప్పటికే దుల్కర్ బాలీవుడ్ లో 'జోయా ఫ్యాక్టర్', 'కర్వా' వంటి సినిమాల్లో నటించారు.

ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది ఇలా ఉండగా.. జాన్వీ 'తక్త్' అనే సినిమాలో కూడా నటించనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.