'మళ్లీరావా' చిత్రం తరువాత దర్శకుడు గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన 'జెర్సీ' సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కథను చాలా మంది నిర్మాతలకు వినిపించానని.. సుమారు 15 మంది నిర్మాతలు ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు గౌతం. 

చిన్నప్పటి నుండి తనకు రాయడమంటే చాలా ఇష్టమని చెప్పిన గౌతం దర్శకుడు అవుతానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని అన్నాడు. తన స్నేహితుడు ఒకరు సినిమా తీస్తే దానికి డైలాగ్స్, స్క్రిప్ట్ రాశానని అప్పుడే టెక్నికల్ వర్క్ తెలుసుకున్నట్లు చెప్పాడు.

తనకు కథ చెప్పడం వచ్చేది కాదని.. ఎంత మంది కథ అయినా చెప్పడం రాకపోతే ఆ కథ వృధా అని మొదట్లో అటువంటి సమస్యలు చాలా ఎదుర్కొన్నట్లు చెప్పాడు. తన స్నేహితుడిని కూర్చోబెట్టి కథ చెప్పడం నేర్చుకున్నాననిచెప్పాడు.

'జెర్సీ' కథ రాయడానికి చాలా సమయం పట్టిందని, చాలా మంది నిర్మాతలు కథను రిజెక్ట్ చేశారని చెప్పాడు. వాళ్లపై రివెంజ్ తీర్చుకోవడానికి ఈ విషయం చెప్పడం లేదని, ఒక్కో నిర్మాతకు ఒక్కో టేస్ట్ ఉంటుందని అన్నారు.