ఇటీవలే సినీ హీరో రాజశేఖర్ తల్లి మృతి గరుడవేగ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న రాజశేఖర్ మరోవైపు జీవిత సోదరుడు శ్రీనివాస్ ను కోల్పోయిన రాజశేఖర్ కుటుంబం
టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబంలో మరో విషాదం జరిగింది. ఇటీవలే ఆయన తల్లి మరణించగా, ఆ బాధ నుంచి తేరుకోకముందే, గత అర్థరాత్రి జీవిత సోదరుడు, రాజశేఖర్ బావమరిది మురళీ శ్రీనివాస్ కన్నుమూశారు. గత జూన్ లోనే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడడుతున్న ఆయనకు సర్జరీ జరిగింది. అప్పటినుంచీ ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది.
జీవిత సోదరుడు మురళీ శ్రీనివాస్ పేరు గతంలో(2011) డ్రగ్స్ మాఫియాలో కూడా ప్రముఖంగా వినిపించింది. 305 గ్రాముల కొకైన్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మురళీ శ్రీనివాస్ ఆ కేసు తర్వాత మళ్ళీ ఎప్పుడూ పెద్దగా వార్తల్లో కనిపించలేదు. ఆయన పార్ధివ దేహాన్ని ఉదయం 9.30 నుంచి గంటన్నర పాటు జూబ్లీహిల్స్ ఫిలించాంబర్ లో ఉంచుతామని, ఆపై మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజశేఖర్ కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇప్పటికే తల్లి మరణించిన బాధలో ఉన్న రాజశేఖర్ అప్ సెట్ అయి ఓ యాక్సిడెంట్ కూడా చేశాడు. మరోవైపు రాజశేఖర్ నటించిన తాజా చిత్రం 'పీఎస్వీ గరుడవేగ' రేపే విడుదల కానుంది. ఈ సమయంలో కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకోవడంతో ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు.
