నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు' అనే డైలాగ్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలోనిది. గమనిస్తే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది.

'నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు' అనే డైలాగ్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలోనిది. గమనిస్తే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి అయిన చిరు.. నెమ్మదిగా రాజకీయాలకు దూరం జరిగారు. 

ప్రస్తుతం చిరంజీవి వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. కానీ ఇప్పటికీ ప్రతి సందర్భంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చిరంజీవి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఎలాంటి భేటీ జరిగినా చిరంజీవిని పాలిటిక్స్ తో ముడిపెట్టేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మాజీ సీబీఐ జేడీ లక్ష్మి నారాయణ సతీ సమేతంగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. 

కానీ లక్ష్మీనారాయణ చిరుని మీట్ అయింది పాలిటిక్స్ కోసం కాదు. తన కుమార్తె ప్రియాంక వివాహానికి వివాహానికి ఆహ్వానించడానికి. లక్ష్మీనారాయణ.. చిరంజీవి, సురేఖ దంపతులకు శుభలేఖ అందించి పెళ్ళికి ఆహ్వానించారు. చిరంజీవి తప్పకుండా హాజరవుతానని తెలిపినట్లు తెలుస్తోంది. 

అయితే వీరిద్దరి భేటీపై పొలిటికల్ గా కూడా వార్తలు అల్లేస్తున్నారు. లక్ష్మీనారాయణ ఏ రాజకీయ పార్టీలో లేనప్పటికీ ఆయనపై పొలిటికల్ గా మంచి అటెన్షన్ ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనీ లక్ష్మి నారాయణ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా జనసేన పార్టీ తరుపున పోటీచేసి మూడవ స్థానం సాధించారు. మరి ఈసారి ఆయన కన్ను ఏ రాజకీయ పార్టీపై ఉందో అనే చర్చ జరుగుతోంది. జెడి లక్ష్మీ నారాయణ సీబీఐలో ఉన్నప్పుడు ఎన్నో హై ప్రొఫైల్ కేసుల్ని సమర్ధవంతంగా దర్యాప్తు చేశారు.