Kathanar Trailer: అనుష్క ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ `కత్తనార్‌`. జయసూర్య హీరోగా నటించిన ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ విడుదలైంది. విజువల్‌ వండర్‌గా ఉంది. మరో అద్భతమైన మూవీ రాబోతుందని అర్థమవుతుంది. 

కత్తనార్‌ తో రాబోతున్న అనుష్క

అనుష్క శెట్టి ఆ మధ్య `ఘాటి` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇప్పుడు మలయాళ చిత్రంతో రాబోతుంది. మలయాళంలో ఆమె `కత్తనార్‌` అనే సినిమాలో నటిస్తోంది. జయసూర్య హీరోగా నటించిన చిత్రమిది. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆర్. రామానంద్, రోజిన్ థామస్ కలిసి కథ అందించారు. 

అద్భుతమైన ప్రపంచాన్ని చూపించబోతున్న `కత్తనార్‌` సినిమా

మలయాళంలోనే అతిపెద్ద సినిమాగా తెరకెక్కుతున్న ఈ బ్రహ్మాండమైన చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. బైజు గోపాలన్, వి.సి. ప్రవీణ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇప్పటివరకు మలయాళ సినీ ప్రేక్షకులు చూడని ఓ అద్భుత ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారనే సంకేతాలను ఈ ట్రైలర్ ఇస్తోంది.

9వ శతాబ్దం నేపథ్యంలో సాగే పీరియడ్ ఫాంటసీ

జాతీయ అవార్డు గెలుచుకున్న 'హోమ్' సినిమా తర్వాత రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. 'హోమ్' విడుదలై ఐదేళ్ల తర్వాత అదే క్రియేటివ్ టీమ్ మళ్లీ ఒక్కటైంది. వారి ఐదేళ్ల కష్టం ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు సినిమాలు, సీరియళ్లలో మనం చూసిన 'కడమట్టత్తు కత్తనార్' కథలకు ఇది పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ఈ పాత్రపై లోతుగా రీసెర్చ్ చేసి, సరికొత్త కథనంతో ఈ సినిమాను రూపొందించారు. మనం ఇప్పటివరకు చూసిన పీరియడ్ ఫాంటసీ సినిమాలకు భిన్నమైన విజువల్ లాంగ్వేజ్‌తో, 9వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథను తెరకెక్కించారు.

`కత్తనార్‌` ట్రైలర్‌ ఎలా ఉందంటే?

ట్రైలర్‌ని చూస్తే, ‘విజ్ఞానం రూపం మూలం ఎలా ఉన్నా కూడా.. కాంతూర్ శాలయలో దాన్ని ఆహ్వానిస్తారు.. ఇంద్రజాలాన్ని నేను నమ్మను.. అవగాహనతో రహస్య మార్గాలలో వాళ్లు దాన్ని పరిశోధిస్తున్నారు.. ఎవరి ఊహకి అందని.. అందరూ ఆశ్చర్యంతో చూసే ఒక మాయా జాలం.. మన ఆత్మతో కలిసి మన జ్ఞాపకాలతో ఐక్యం కాబోయే ఒక సంఘటన.. చేర మహారాజుకి కుంచమున్ తరుపున శుభాకాంక్షలు’.. ‘చూసినది విన్నది ఏదీ రాదు.. వచ్చేది ఒక్కటే.. ఆపత్కాలంలో వచ్చే మహా మనిషి అగ్ని ఒక్కటే’.. ‘కరం కలిస్తే ఆప్యాయిత.. కరం వెడిస్తే నాశనమే బలం’.. ‘ఒక శరీరాన్ని అదుపు చేసే ఎక్కువ శక్తిని మీరు నియంత్రించగలిగారు.. ఎలాగా?’.. ‘మేం చెప్పేది నమ్మండి. వేనాడు ఆపదలో ఉంది’.. ‘మాయ.. ప్రపంచమే మాయ’ అంటూ సాగిన డైలాగ్స్‌తో ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇందులో జయసూర్య నట విశ్వరూపం చూపిస్తే, క్యూట్‌ లుక్‌లో కట్టిపడేసింది అనుష్క. 

YouTube video player

హాలీవుడ్‌ రేంజ్‌లో కత్తనార్‌` మూవీ విజువల్స్ 

హాలీవుడ్ సినిమాలను తలపించే విజువల్ క్వాలిటీ, అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో పాటు రాహుల్ సుబ్రమణియన్ అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్ డైరెక్షన్, సౌండ్... ఇలా ప్రతీది మనం చూసిన పీరియడ్ సినిమాల కంటే భిన్నంగా ఉంది. ఐదేళ్ల పాటు రోజూ 500 మందికి పైగా వివిధ విభాగాల్లో కష్టపడిన ఫలితమే ఈ సినిమా అని దర్శకుడు రోజిన్ థామస్ అన్నారు.

15 భాషల్లో కత్తనార్‌ రిలీజ్‌

ఇంత పెద్ద సినిమాను నిర్మించడానికి శ్రీ గోకులం గోపాలన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణమూర్తి చూపిన ధైర్యం, వారి విజన్‌ను అభినందించాలి. ఐదేళ్ల పాటు సాగిన నిర్మాణ ప్రక్రియకు సపోర్ట్ చేసిన ప్రొడక్షన్ టీమ్, ఈ సినిమా కోసం తన కెరీర్‌లో నాలుగేళ్లు కేటాయించిన నటుడు జయసూర్య వల్లే ఈ సినిమా ఇంత క్వాలిటీతో రూపుదిద్దుకుందని రోజిన్ థామస్ తెలిపారు. సినిమాలోని ప్రతీ విభాగంలో అత్యుత్తమ అవుట్‌పుట్ తీసుకురావడానికే ప్రయత్నించామని ఆయన అన్నారు. ఈ సినిమా ఏకంగా 15 భాషల్లో విడుదల కానుంది.