బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'కి ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోని పొగిడేవారితో పాటు విమర్శించే వారు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటివరకు ఈ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా రాజకీయాల కారణంగా షోకి దూరమయ్యారు. 

వారిని రీప్లేస్ చేసే ప్రాసెస్ లో జబర్దస్త్ నిర్వాహకులు సీనియర్ నటి జయసుధని సంప్రదించారట. కానీ ఆ ఆఫర్ ని ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ క్లాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత కూడా కుటుంబ విలువలు ఉన్న పాత్రల్లో నటిస్తూ సక్సెస్ అవుతున్నారు. 

ఇలాంటి నేపధ్యంలో వల్గర్ కామెడీ తనకు సూట్ అవ్వదని జయసుధ సున్నితంగా తనకు వచ్చిన ఆఫర్ ని నిరాకరించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షోకి జడ్జిగా వ్యవహరించడం కోసం జయసుధకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట.

కానీ ఆమె మాత్రం రాజీ పడలేదని సమాచారం. జయసుధ ఇలాంటి నిర్ణయం తీసుకొని మంచి పని చేసిందని, ఆమెకి ఇలాంటి వల్గర్ కామెడీ షోలు సెట్ కావని సినీ పరిశ్రమలో కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జయసుధ కాదనడంతో ఆ షోకోసం ఒకప్పటి హీరోయిన్ మీనాని రంగంలోకి దించారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్, మీనా కలిసి ఈ షోని హోస్ట్ చేస్తున్నారు.