నటి జయసుధ భర్త నితిన్ మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు దాదాపుగా ముగిసినట్లేనని తెలుస్తోంది. నితిన్ కపూర్ ఆత్మహత్యకు ఆర్థిక పరిస్థితులే కారణమని తెలుస్తోంది. ఇటీవల నితిన్ కొన్ని హిందీ చిత్రాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. అయితే అవి అప్పులకు దారితీసినందునే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం.

 

ఇటీవల జయసుధ నితిన్ ల కుమారుడు శ్రేయాన్‌తో నిర్మించిన బస్తీ చిత్రం కూడా నష్టాలను మిగల్చడం ఆయన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. గతకొద్ది కాలంగా నితిన్ డిప్రెషన్‌లో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. ఘటన జరిగినప్పుడు జయసుధ కుమారులు ముంబైలోనే ఉన్నప్పటికీ, ఇంటివద్ద లేని సమయంలో నితిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

 

ఇక జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారని, ఇందులో అనుమానాస్పద అంశాలేవీ లేవని ముంబై పోలీసులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ముంబైలోని అంధేరీ వెస్ట్ జేపీ రోడ్‌లో ఉన్న సీ గ్లింప్స్ భవన సముదాయంలోని సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్‌, ఆ ఇంటినే తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు నితిన్‌కపూర్‌ ఈ భవనం ఆరో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసుల ప్రకటన స్పష్టం చేసింది.

 

టెరెస్ తలుపులకు వేసి ఉన్న తాళాన్ని పగులగొట్టి పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి నితిన్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆయన మరణాన్ని తొలుత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. నితిన్ దాదాపు ఏడాదిన్నర నుంచి డిప్రెషన్‌లో ఉన్నారని, కోకిలాబెన్ ఆసుపత్రిలో సైక్రియాటిక్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని ముంబై పోలీసులు వెల్లడించారు. నితిన్ కపూర్ అంత్యక్రియలు ముంబైలోనే జరపాలని నిర్ణయించారు.