ఒకప్పటి అగ్రహీరోలందరి సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి జయసుధ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకొని టాలీవుడ్ లో బిజీ నటిగా మారింది. ఇప్పుడు ఆమె ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఒకప్పుడు మాత్రం అప్పులవాళ్లు ఇంటికి వచ్చి డబ్బు అడుగుతుందంటే ఉన్నదంతా అమ్మి ఇచ్చేశామంటూ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది జయసుధ.

''నాకు పెళ్లి అయిన తరువాత దాసరి గారి దర్శకత్వంలో నిర్మాతగా 'ఆత్మబంధువులు' అనే సినిమా తీశాం. అది బాగా ఆడింది. ఆ తరువాత 'కాంచన సీత' అనే సినిమాతో రఘువరన్ గారిని పరిచయం చేశాం. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత జితేంద్ర గారితో హిందీలో ఓ సినిమా చేశాం. అది కొంచెం దెబ్బతింది. దాని తరువాత 'అదృష్టం' అనే సినిమాతో బాగా నష్టపోయాం. అలా నష్టపోయిన సమయంలో కూడా 'హ్యాండ్సప్' అనే సినిమా చేసి దివాళా తీశాం. ఆ సినిమాలో చిరంజీవి చిన్న పాత్ర పోషించారు. ఆయన సినిమాలో ఉన్నారని కూడా చాలా మందికి తెలియదు.

ఆ విషయం ముందుగానే చెబితే అభిమానులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారని, అది సినిమా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చిరంజీవి గారు తన ఫోటోని సినిమా పోస్టర్ మీద వేయొద్దని చెప్పారు. కానీ అలా చేయడంతో పూర్తిగా రివర్స్ అయింది. సినిమాకు ఓపెనింగ్స్ కూడా లేవు. చాలా నష్టపోయాం. ఎవరైనా వచ్చి డబ్బులు ఇవ్వాలని అంటుంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ మూడు సినిమాలతో ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోతూ వచ్చాయి. దాదాపు కిందకి వచ్చేశాం'' అంటూ చెప్పుకొచ్చింది.