జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ గురువారం నాడు ఓ ప్రకటనను విడుదల చేశారు.

'గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్  సమయంలో వెన్నుపూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ తనను వెన్ను నొప్పి బాధిస్తోందని.. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడం వలన గాయాల నొప్పి తీవ్రత పెరిగిందని.. డాక్టర్లు సర్జరీకీ వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

గత కొన్ని రోజులుగా మళ్లీ వెన్ను నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని.. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పారు.

ఈ కారణంగానే విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని అన్నారు. మీడియా స్వేచ్చ కోసం చేస్తున్న ఈ పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు.