జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమను (tollywood) చిక్కుల్లో పడేశారు. వైసీపీ నేతల ముందు మోకరిల్లి చేతులు కట్టుకుని, బతిమలాడుకుంటేనే వారి ఇగో శాటిస్‌ఫై అవుతుందన్నారు. దీనిని బట్టి పరోక్షంగా సీఎం జగన్‌తో అగ్ర హీరోల చర్చలపై పవన్ విమర్శలు గుప్తించారు. 

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమను (tollywood) చిక్కుల్లో పడేశారు. అగ్ర హీరోలు, నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్లు పలు దఫాలుగా ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌తో (ys jagan) చర్చలు జరిపి ధియేటర్ల సమస్యలు, సినిమా టికెట్ ధరలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టారు. వైసీపీ నేతల ముందు మోకరిల్లి చేతులు కట్టుకుని, బతిమలాడుకుంటేనే వారి ఇగో శాటిస్‌ఫై అవుతుందన్నారు. దీనిని బట్టి పరోక్షంగా సీఎం జగన్‌తో అగ్ర హీరోల చర్చలపై పవన్ విమర్శలు గుప్తించారు. 

చిరంజీవి (chiranjeevi), మహేశ్ బాబు (mahesh babu) , ప్రభాస్ (prabhas) కొద్దిరోజుల క్రితం సీఎం జగన్‌తో కూర్చొని ధియేటర్ల సమస్యలు, టికెట్ ధరల సమస్యలపై చర్చించి.. పరిష్కారం వరకు లాక్కొచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గతంలో కూడా సాయి థరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ సర్కార్‌పై ఆరోపణలు చేసి సమస్యను పవన్ మరింత జటిలం చేశారు. ఇప్పుడు అంతా సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరోసారి ఇష్యూని కెలికి.. ఇటు పరిశ్రమను, అటు హీరోల్ని ఇరకాటంలో పడేశారు. రేపో, మాపో ప్రభుత్వం ఆదేశాలు వస్తున్న తరుణంలో పవన్ హాట్ కామెంట్స్ సమస్యలను మళ్లీ మొదటికి తీసుకొచ్చాయి. చిరంజీవి బృందం నాలుగు నెలలుగా చేస్తున్న కృషి మొత్తం నేలపాలైనట్లయ్యింది. 

అంతకుముందు నరసాపురంలో జరిగిన మత్య్సకార అభ్యున్నతి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మత్స్యకారులకు జీవో 217 (go no 217) పెద్ద సమస్యగా మారిందని.. రాష్ట్రంలో లక్షన్నర మంది మత్స్యకారులు వున్నారని గుర్తుచేశారు. జనసేనకు పదిమంది ఎమ్మెల్యేలు వుంటే 217 జీవో వచ్చేది కాదంటూ దానిని వేదికపైనే చింపేశారు. దోపిడి చేసే చట్టాలను పాటించాల్సిన అవసరం లేదని.. మత్స్యకారుల కోసమే జీవోను చింపేశానని పవన్ చెప్పారు. తనను జైలుకు పంపితే పంపుకోవాలంటూ జనసేనాని సవాల్ విసిరారు. తాను చట్టాలను నమ్ముతానని.. కానీ ఇబ్బంది పెట్టే చట్టాలను ఉల్లంఘిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను భయపడేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. వంగి వంగి దండాలు పెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదని ఆయన స్పష్టం చేశారు. 

చిన్న వలతో సముద్రంలోకి పోవాలంటే ఎంత సహసం వుండాలని.. మీ సాహసమే నాకు స్పూర్తి అని పవన్ కల్యాణ్ చెప్పారు. లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్ధండులని.. ఆ సమస్య పరిష్కరించమంటే మాత్రం కాలయాపన చేస్తారని మండిపడ్డారు. పెన్షన్లు , ప్రభుత్వ సాయం రాదంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని.. వైసీపీ నేతలు బ్రాందీ షాపు పక్కనే చీకుల కొట్టులు పెట్టుకోవాలంటూ పవన్ కల్యాణ్ చురకలు వేశారు. మీకు అధికారం ఇచ్చింది మటన్ కొట్లు, చికెన్ కొట్లు నడపమని కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు పాదయాత్ర చేసింది మటన్ , చేపలు అమ్ముకోవడానికా అని పవన్ ప్రశ్నించారు. 

పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలేమయ్యాయని ఆయన మండిపడ్డారు. చట్టాలు మాకే వర్తిస్తాయా..? మీకు వర్తించవా అని ఆయన నిలదీశారు. ఏటా 25 వేల మంది మత్స్యకారులు ఏపీ నుంచి గుజరాత్‌కు వలస వెళ్తున్నారని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. వైసీపీ నేతల ఆలోచనల ఏంటంటే ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదు.. అందరూ దేహీ అని అడుక్కోవాలని ఆయన మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యం, నియంతృత్వ రాజ్యం కాదని పవన్ చురకలు వేశారు. 

వచ్చే ఎన్నికల్లో మీరు తనకు అండగా నిలబడాలని జనసేనాని కోరారు. తాను చావడానికైనా సిద్ధమే కానీ.. తలవంచేందుకు కాదని పవన్ స్పష్టం చేశారు. ఎంత పెద్దవాళ్లయినా సరే జగన్ వద్దకు వెళ్లి సర్ మీరు మాకు చేయాలి సర్ అని పిలవాలి.. మీ ఇగో శాటిస్‌ఫై అవ్వాలి, ఇదేమైనా ఫ్యూడలిజమా అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ మార్చి 14న కలుద్దామంటూ ఆయన మత్స్యకారులకు తెలిపారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున.. రాష్ట్రం ఏ విధంగా వుండాలనే దానిపై చర్చిద్దామన్నారు.