సావిత్రితో ఏడాది పాటు మాట్లాడని జమున... వెండితెరకు పరిచయం చేసిన అక్కతో గొడవేంటి!
సావిత్రి-జమున సొంత అక్కాచెల్లెళ్లు మాదిరి మెదిలేవారు. అయితే జమున పరిశ్రమకు వచ్చేందుకు ఊతం ఇచ్చిన సావిత్రితో కూడా జమున ఏడాది కాలం మాట్లాడలేదట.

సావిత్రి-జమునకు మధ్య కూడా మనస్పర్థలు తలెత్తాయట. ఈ విషయాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశారు. సావిత్రి స్టేజ్ ఆర్టిస్ట్. హీరోయిన్ కాక ముందు నాటకాలు ఆడేవారు. అప్పట్లో నాటకాలకు కొన్ని ప్రసిద్ధ ప్రాంతాలు ఉండేవి. వ్యాపారం కోసం జమున ఫ్యామిలీ గుంటూరు జిల్లా దిగ్గిరాలకు రావడం జరిగింది. నాటకాలు ఆడేందుకు అక్కడొచ్చిన సావిత్రి పలుమార్లు జమున ఇంట్లో స్టే చేశారట. అప్పుడు జమునతో స్నేహం ఏర్పడింది.
సావిత్రి మద్రాస్ వెళ్లి స్టార్ అయ్యాక కూడా జమునతో ఆమె స్నేహం కొనసాగింది. జమునకు కూడా నటన పట్ల మక్కువ ఉంది. నృత్యం వంటి కళల్లో ప్రావీణ్యం ఉంది. దాంతో సావిత్రి ప్రోత్సహించి సినిమాల్లోకి తీసుకొచ్చారు. తన అందం, అభినయంతో జమున అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. సావిత్రి-జమున అనేక చిత్రాల్లో వెండితెర అక్కాచెల్లెళ్లుగా నటించారు. సావిత్రి జమునను అక్కా అని పిలిచేవారట.
మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ లో వీరు కలిసి నటించారు. సావిత్రి కన్నుమూసే వరకు వారి స్నేహం కొనసాగింది. జమున పెళ్లిలో సావిత్రి అన్నీ తానై వ్యవహరించిందట. పెళ్లి కూతురిగా జమునను సావిత్రి అలకరించారట. ఇంత అనుభందం ఉన్న సావిత్రి-జమున కూడా ఏడాది పాటు మాట్లాడుకోలేదట. వీరి అన్యోన్యత చూడలేని కొందరు ఇద్దరి మధ్య గొడవలు పెట్టారట. కొన్నాళ్లుగా మాట్లాడుకోని సావిత్రి, జమున తర్వాత దగ్గరయ్యారట. యధావిధిగా మాట్లాడుకున్నారట. సావిత్రి చివరి రోజుల్లో పడ్డ కష్టాలు, ఆమె జీవితం ముగిసిన విధానం కలచి వేసిందని జమున గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.