నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘జై సింహా’ చిత్రం జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి తరహాలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి కూడా అర్ధరాత్రి షోలకు అనుమతులు ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి కానుకగా వస్తున్న ‘జై సింహా’ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 12వ తేదినుంచి 16వ తేది వరకూ ఐదు రోజుల పాటు ‘జై సింహా’ అర్ధరాత్రి సినిమా ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

 

బాలకృష్ణ ‘జై సింహా’ చిత్రానికి అర్ధరాత్రి షోలకు అనుమతిచ్చిన నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ సంబూరాల్లో మునిగితేలారు. ఇప్పటికే థియేటర్స్ వద్ద బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్స్‌తో హంగామా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా... బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో బాలయ్య దూసుకుపోవడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. గత ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి సత్తా చాటిన బాలయ్య.. ఈ సంక్రాంతికి ‘జై సింహా’తో మరో హిట్ కొడతాడా లేదా అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.

 

బాలయ్య ‘జై సింహా’ చిత్రం బంపర్ హిట్ అవుతుందని నిర్మాత సి. కళ్యాణ్ కాన్ఫిడెంట్ గా వున్నారు. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. జైసింహ చిత్రానికి సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ సక్సెస్ పై యూనిట్ అంతా ధీమాగా ఉన్నారు.  పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలయ్యకు జోడిగా నయనతార, హరిప్రియ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించారు.