బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రెండవ వారం కూడా ముగిసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 3లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటుండగా తొలి వారం హేమ ఎలిమినేట్ అయింది. దీనితో హేమ స్థానంలో ట్రాన్స్ జెండర్ తమన్నా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. 

ఆదివారం రోజు రెండవ ఎలిమిలేషన్ కూడా జరిగిపోయింది. ఈ వారం మొత్తం 8మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో నలుగురు సేవ్ అవుతున్నట్లు నాగ్ శనివారం ప్రకటించారు. హిమజ, మహేష్, శ్రీముఖి, రాహుల్ శనివారం సేవ్ అయ్యారు. ఇక మిగిలిన జాఫర్, వరుణ్, వితిక, పునర్నవి లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ జాఫర్ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఆదివారం నాగార్జున పునర్నవి సేవ్ అవుతున్నట్లు తొలుత ప్రకటించారు. 

ఆ తర్వాత వితిక, వరుణ్ దంపతులని నాగ్ కాసేపు టెన్షన్ పెట్టాడు. మీరు ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావలసి వస్తే ఎవరు ఉండాలని కోరుకుంటారు.. ఎవరు ఎలిమినేట్ కావాలని కోరుకుంటారు ప్రశ్నించాడు. తాను ఎలిమినేట్ అయి వితికని సేవ్ చేస్తానని వరుణ్ తెలిపాడు. వితిక మాత్రం తానే సేవ్ కావాలని కోరుకుంటానని తెలిపింది. 

అదే సమయంలో బిగ్ బాస్ స్టేజిపైకి ఇస్మార్ట్ శంకర్ జంట రామ్, నిధి అగర్వాల్ గెస్ట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. కాసేపు ఇంటి సభ్యులతో రామ్, నిధి ముచ్చటించారు. నాగార్జునతో కలసి ఇస్మార్ట్ సాంగ్ కు స్టెప్పులేశారు కూడా. వరుణ్, వితిక, జాఫర్ లలో సేవ్ అయ్యే ఒకరి పేరు ప్రకటించాలని నాగార్జున రామ్ ని కోరాడు. 

వరుణ్ సందేశ్ సేవ్ అవుతున్నట్లు రామ్ ప్రకటించాడు. దీనితో వితికలో టెన్షన్ పెరిగిపోయింది. జాఫర్ మాత్రం కూల్ గానే ఉన్నాడు. చివర్లో నాగార్జున ఇంటి సభ్యుల అభిప్రాయాన్ని అడగగా 7గురు జాఫర్ కు మద్దతు తెలిపారు. 6 గురు వితికని సపోర్ట్ చేశారు. కానీ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం జాఫర్ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు. జాఫర్ ఇంటి నుంచి వెళుతూ కన్నీరు పెట్టుకున్నాడు.