హాలీవుడ్ బిగ్గెస్ట్ సిరీస్ లలో ది పైరేట్స్‌ ఆఫ్ ది కరేబియన్‌ ఒకటి. వరుసగా వరల్డ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ వస్తోన్న ఈ కాన్సెప్ట్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇక ఇప్పటికే 5 సిరీస్ లు రాగా మరో సిరీస్ త్వరలోనే మొదలుకాబోతోంది. భారీ బడ్జెట్ తో ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాను తెరకెక్కించనున్నారు. సముద్ర దొంగలు వీరు అనే ట్యాగ్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సిరీస్ లు పలకరించాయి. 

ఇకపోతే సినిమాలో ఎంతగానో ఆకట్టుకునే పాత్ర  జాక్‌స్పారో. ఆ క్యారెక్టర్ తో అలరించే హాలీవుడ్ సూపర్‌ స్టార్‌ జానీ డెప్‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇక జాక్‌స్పారోగా అతను కనిపించడు. అతని స్థానంలో మరో ప్రముఖ హాలీవుడ్ నటుడు కనిపించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. 

కొత్త జాక్‌స్పారోగా నటించబోయే ఆ కొత్త నటుడు ఇంకా ఎవరనేది అధికారికంగా వెలువడలేదు కానీ గత 14 ఏళ్లుగా ఆ పాత్రతో అలరిస్తున్న జానీ డెప్‌ మాత్రం కనిపించడని చిత్ర నిర్మాణ సంస్థ మీడియాకు ప్రకటనను విడుదల చేసింది. అయితే అతను నటించకపోవడానికి గల కారణాన్ని కూడా నిర్మాతలు చెప్పలేదు. దీంతో సినిమాపై వస్తోన్న అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.