జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో పాగల్ పవిత్ర ఒకరు. జీవితంలో తాను పడ్డ కష్టాలు, పేదరికం గురించి వివరిస్తూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
జబర్దస్త్ లో లేడీ గెటప్స్ అబ్బాయిలే వేసేవారు. అయితే వర్ష, సత్యశ్రీ, ఐశ్వర్య వంటి లేడీ కమెడియన్స్ వచ్చాక షోకి మరింత కళ వచ్చింది. దారుణమైన లేడీ గెటప్స్ చూసే బాధ తప్పింది. జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో పాగల్ పవిత్ర కూడా ఒకరు. చాలా కాలంగా జబర్దస్త్ లో పని చేస్తున్న పాగల్ పవిత్ర తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు టీమ్ లీడర్స్ తో ఆమె పనిచేశారు. అలాగే ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు.
ఇటీవల పాగల్ పవిత్ర ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నప్పటి నుండి పడ్డ కష్టాలు గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. మా నాన్న లారీ డ్రైవర్. అమ్మ వ్యవసాయ కూలీ. పని చేస్తేనే తిండి. మూడు పూటలా తిండి దొరకడం కూడా కష్టంగా ఉండేది. నాన్న మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవారు కాదు. బంధువుల సహాయంతో ఇంటర్ వరకు చదివాను.
కుటుంబానికి భారం కాకూడదని హైదరాబాద్ వచ్చేశాను. ఇక్కడ ఒక సెలూన్ పెట్టాను. ఆ సమయంలోనే జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. మరోవైపు సెలూన్ పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఆ సెలూన్ అమ్మేశాను. ఆ డబ్బులతో మా సొంత ఊర్లో ఇల్లు కొనుక్కున్నాము. అప్పటి వరకూ మా కంటూ ఒక ఇల్లు లేదు. నాన్న మీద కోపంతో 13 ఏళ్ళు మాట్లాడలేదు.ఆయన ముఖం చూడటానికి కూడా ఇష్టపడే దానిని కాదు. ఏడాది క్రితం ఆయన చనిపోయారు. ఆ విషయం తెలిసి నేను సంతోషపడ్డాను... అని పాగల్ పవిత్ర చెప్పుకొచ్చారు.
తండ్రి మీద పవిత్రకు ఎంత కోపం ఉందో ఆమె మాటల్లో అర్థం అవుతుంది. జబర్దస్త్ వేదికగా ఎదిగిన చాలా మంది కమెడియన్స్ ఇలాగే చాలా క్రింద స్థాయి నుండి వచ్చినవాళ్లే. సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న సుడిగాలి సుధీర్ సైతం తిండిలేక నీళ్లు తాగి రోడ్లమీద పడుకున్న రోజులు ఉన్నాయని చెప్పాడు. జబర్దస్త్ ఎందరికో జీవితం ఇచ్చింది. కోట్లు సంపాదించే స్థాయికి తీసుకెళ్లింది. అయితే జబర్దస్త్ చిన్నగా ప్రాభవం కోల్పోతుంది. సీనియర్ కమెడియన్స్ అందరూ తప్పుకోవడంతో ఒకప్పటి ఆదరణ లేదు.
