జబర్దస్త్ కమెడియన్ ఒకరు స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలింపు చేపట్టారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు రైడ్ కి వెళ్లడం జరిగింది. నాగబట్ల, చికిమానుకోన, వెస్ట్ బీట్ ప్రాంతాలలో అధికారులు నిర్వహించిన కూబింగ్ లో ఎనిమిది మంది స్మగ్లర్లు పట్టుబట్టారు. వీరి వద్ద నుండి రూ. 3లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలు, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. 


కాగా పట్టుబడిన ఈ గ్యాంగ్ తో జబర్దస్త్ హరికి సంబంధాలు ఉన్నట్లు తమ విచారణలో తేలిందని అధికారులు తెలుపుతున్నారు. దీంతో హరి కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. హరి ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు అరెస్ట్ కి రంగం సిద్ధం చేశారట. 


అయితే గతంలో కూడా హరిపై స్మగ్లింగ్ ఆరోపణలు రావడం జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ ద్వారా కోట్లు గడించిన హరి, మరో జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ నటించిన ఓ చిత్రానికి ఫైనానాన్స్ చేశాడని అప్పట్లో ఆరోపణలు రావడం జరిగింది. అయితే తనపై వచ్చిన స్మగ్లింగ్ ఆరోపణలను హరి గతంలో ఖండించారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ స్మగ్లింగ్ కి పాల్పడుతుంటే సమాచారం ఇచ్చానని, ప్రతీకారంగా తనపై ఇలా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని  వివరణ ఇచ్చాడు.