అనసూయ భరద్వాజ్, రష్మీ  వీళ్లిద్దరూ తమ యాంకరింగ్‌తో జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ కు ప్లస్ అయ్యారు. అలాగే... కేవలం యాంకర్‌గానే కాకుండా.. హీరోయిన్స్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ లుగా సినిమాల్లో తమ సత్తా చాటుతున్నారు. వీటికి మాత్రమే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై తమదైన శైలిలో సోషల్ మీడియాలో వివిధ అంశాలపై  స్పందిస్తుంటారు. తాజాగా అనసూయ ప్రెజంట్ సొసీటీలోని జనాల భాధ్యతలేని తనంపై, ఇతురులపై నెపం వేయటం వంటి విషయాలపై  తనదైన శైలిలో స్పందించారు.

ట్విటర్‌ వేదికగా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అనసూయ ట్వీట్ చేస్తూ..‘‘ప్రతి విషయానికీ ఎందుకు మనం ఇతరులను నిందించడం. నీటిని కాపాడాలంటే ప్రభుత్వాన్ని, అమ్మాయిల భద్రత లేదంటే పోలీసులను, లేదా ప్రభుత్వాన్ని, అన్నింటికీ వాళ్లనీ, వీళ్లనీ ఎందుకు తిట్టాలి. మన వనరులను, కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, విధి ప్రతి ఒక్కరికీ ఉంది. 

మన చుట్టుపక్కల ఏదైనా తప్పు, చెడు జరుగుతుంటే ఆపకుండా, ఎక్కడో స్టేషన్‌లో కూర్చొన్న పోలీస్‌ని, ఆఫీస్‌లో కూర్చొన్న అధికారిని అనడం ఎంత వరకూ కరెక్ట్‌ చెప్పండి. వాళ్లు చేయగలిగినంత చేస్తారనే నమ్మకంతో ఉంటూ చెడ్డ పనులను అక్కడే అడ్డుకోండి. ‘నేను చేసే, చేయబోయే, చేయాలనుకునే ఫలానా పని చేయడం ఒక మనిషిగా ఎంత వరకూ కరెక్ట్‌’ అని ప్రతి ఒక్కరూ ఆలోచించేలా చూడండి’’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్  వస్తోంది.

ఈ ట్వీట్ కు  ఓ నెటిజన్‌ స్పందిస్తూ, ‘సమాజంలో మంచి మార్పు తెస్తారని అనసూయ, రష్మి గౌతమ్‌లపై బలమైన నమ్మకం ఉంది. దయా హృదయంతో సమాజానికి, పేదలకు సాయం చేయాలన్న మీలాంటి వారు నిజంగా గ్రేట్‌’ అని కామెంట్ చేసాడు. 

దీనికి రష్మి స్పందిస్తూ, ‘మాపై కాదు, మీపై మీకు నమ్మకం ఉండాలి. మీ పని మీరు చేయండి. మిగిలినవన్నీ వాటికవే సర్దుకుంటాయి. బాధ్యతల విషయంలో ప్రతి ఒక్కరికీ సమాన భాధ్యత  ఉంది’ అని సమాధానం ఇచ్చింది.