బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలిపై బాలీవుడ్ లో రూమర్లు వినిపిస్తున్నాయి. ఆమె ప్రేమలో ఉందని, ఓ అప్ కమింగ్ కుర్ర హీరోని ఆమె ప్రేమిస్తుందని కథనాలు ప్రచురిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటుడు జావేద్ జాఫెరి తనయుడు మీజాన్ తో నవ్య నవేలి డేటింగ్ చేస్తున్నట్లు టాక్.

వీరిద్దరూ కలిసి సన్నిహితంగా మెలగడం, పార్టీలంటూ ఎంజాయ్ చేయడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. మీజాన్ హీరోగా 'మలాల్' అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ బ్యానర్ నుండి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

జూలైలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీజాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడికి నవ్య నవేలితో ఎఫైర్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటిపై స్పందించిన మీజాన్ తను ఎవరితో రిలేషన్ షిప్ లో లేనని చెప్పాడు. 

నవ్య తన చెల్లెలికి ఫ్రెండ్ అని, వారు తరచూ కలుస్తుండడంతో తనకు కూడా మంచి ఫ్రెండ్ అయిందని, అంతేతప్ప ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని తేల్చి చెప్పాడు. మీడియా కావాలని ఈ విషయాన్ని పెద్దది చేస్తుందని మండిపడ్డాడు. ప్రస్తుతం తన లక్ష్యం సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవడమేనని అన్నారు.