అందరూ ఊహించిన విధంగానే దర్శకుడు గోపి చంద్ మలినేని బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఏకంగా నట సింహం బాలయ్యతో ఆయన నెక్స్ట్ మూవీ సెట్ చేశారు. కొద్దిరోజులుగా ఈ కాంబినేషన్ లో మూవీ వస్తుందని కథనాలు వస్తుండగా దీనిపై స్పష్టత వచ్చింది. క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు గోపీచంద్ మలినేని. చాలా గ్యాప్ తరువాత ఆయన రవితేజతో చేసిన క్రాక్, ఆ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ నమోదుచేసింది. 


రవితేజ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచిన క్రాక్ మూవీ లాక్ డౌన్ తరువాత మొదటి హిట్ చిత్రంగా నిలిచింది. క్రాక్ మూవీ కలెక్షన్స్ చిత్ర పరిశ్రమకు ఎంతో సంతోషం పంచాయి. తెలుగు పరిశ్రమ మరలా గాడిన పడిందన్న నమ్మకం తెచ్చింది క్రాక్ మూవీ. క్రాక్ మూవీ టేకింగ్ చూసిన చాలా మంది నిర్మాతలు గోపీచంద్ కి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. కాగా బాలకృష్ణతో ఆయన మూవీ చేయనున్నారని కథనాలు రావడం జరిగింది. 


దీనిపై గతంలో గోపీచంద్ స్పందిస్తూ ప్రాజెక్టు చర్చలో దశలో ఉందని, త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పారు. నిన్న బాలయ్యను కలిసిన గోపీచంద్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రాక్ మూవీ విజయం నేపథ్యంలో బాలయ్య  ఫ్యాన్స్ సైతం ఈ కాంబినేషన్ పై ఆనందంతో ఉన్నారు. రవితేజనే ఆ రేంజ్ లో ఎలివేట్ చేసిన గోపీచంద్ బాలయ్యను ఏ స్థాయిలో చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలో మొదలైపోయింది. ఈ మూవీ పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.