టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'హీరో' అనే సినిమా చిత్రీకరణ ఆగిపోయిందని సమాచారం. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మాళవిక మోహన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతోంది. 
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

ఈ సినిమాలో విజయ్ బైకర్ గా కనిపించనున్నారని తెలిసింది. దాదాపు రూ.15 కోట్ల ఖర్చుతో కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు సమాచారం. స్క్రిప్ట్ విషయంలో విజయ్ కి డైరెక్టర్ తో అభిప్రాయబేధాలు రావడంతో షూటింగ్ ఆపేసినట్లు ప్రచారం జరుగుతోంది.

విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అవ్వడం, సలహాలు ఇవ్వడం దర్శకుడు ఆనంద్ కి నచ్చలేదని చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా అవుట్ పుట్ విషయంలో సంతృప్తిగా లేరని సమాచారం. అందుకే ఇప్పటివరకు పదిహేను కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఇకపై రాజీ పడకూడదని సినిమా షూటింగ్ ఆపినట్లు తెలుస్తోంది.

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. విజయ్ దేవరకొండ కానీ, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కాని స్పందిస్తుందేమో చూడాలి. తాజాగా విజయ్ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కొందరిని  ఆకట్టుకుంటుంటే కొందరికి మాత్రం సినిమా నచ్చడం లేదు.