‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత  దాదాపు ఏడాది గ్యాప్  తీసుకుని  బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బన్నీ బిజీ బిజీ అయ్యారు. ముందుగా త్రివిక్రమ్ తో సినిమా మొదలెట్టారు అల్లు అర్జున్. ఈ   సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్‌ 24 నుంచి మొదలైంది. ఇందులో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేయబోయే మరో చిత్రం సైతం ప్రకటించారు. 

వేణు శ్రీరామ్‌ దర్శకుడిగా, ‘దిల్‌’ రాజు నిర్మాణంలో  ‘ఐకాన్‌: కనబడుట లేదు’ అనే చిత్రం ఉంటుందని ప్రకటించారు. నానితో 'ఎమ్.సి.ఎ' వంటి విజయాన్నందుకున్న వేణు శ్రీరామ్..ఈ చిత్రం కథని రోడ్ జర్నీ నేపథ్యంలో సాగేలా ప్లాన్ చేసారట.అప్ప‌టి వ‌ర‌కూ ఓ క్యూట్‌ ల‌వ్ స్టోరీగా, స‌ర‌దా రోడ్ జ‌ర్నీగా సాగిన ‘ఐకాన్‌’ స‌డ‌న్‌గా విషాదంతమైపోతుంద‌ని  ప్రచారం మొదలైంది. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ తనకు చాలా ఇష్టమైన బైక్ ని పోగొట్టుకుంటాడట. బైక్ కోసం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తాడట.

అలా బైక్ పోయిందని ఫిర్యాదు చేయటానికి వెళ్తే ...అక్కడ పోలీస్ లు తమ పరిధిలోకి రాదని .. వేరే పోలీస్ స్టేషన్ కు వెళ్ళమని చెబుతారు. మరో పోలీస్ స్టేషన్ లో కూడా బన్నీకి దాదాపు అదే పరిస్థితి ఎదురవుతుంది. దీనితో పోలీసులకు బుద్ది చెప్పాలని అల్లు అర్జున్ భావిస్తాడట. అక్కడి నుంచి పోలీసులకు, బన్నీకి మధ్య మైండ్ గేమ్ మొదలవుతుందని అంటున్నారు.

అయితే ఇదే కథతో బన్ని సినిమా చేస్తున్నాడా లేక మీడియావాళ్లు వండి వడ్డించేసిన ఉప్మా కథా.. తెలియాలంటే కొద్ది కాలం ఆగాల్సి ఉంది. ‘ఆర్య, పరుగు, డీజే’ సినిమాల తర్వాత ‘దిల్‌’రాజు బ్యానర్లో నాలుగోసారి నటించనున్నారు అల్లు అర్జున్‌.