యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. షూటింగ్ ప్రారంభమై ఏడాది గడచింది. చిత్ర కథకు సంబందించిన కొంత సమాచారం, కొందరు నటీనటుల గురించి తప్ప రాజమౌళి ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. 

కానీ మంగళవారం రోజు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదాలు పడుతూ నెమ్మదిగా సాగుతోందని వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయిపోయింది ప్రకటించింది. దీనితో ఆర్ఆర్ఆర్ మూవీ ముందుగా ప్రకటించినట్లుగానే 2020, జులై 30న రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

బుధవారం రోజు ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్, విలన్ల వివరాలు ప్రకటిస్తామని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీనితో ఆర్ఆర్ఆర్ మూవీలో నటించే నటీనటులపై ఆసక్తికర ఊహాగానాలు మొదలయ్యాయి. 

బ్రిటీష్ వారి కోర్టులో రాంచరణ్.. RRRలో కీలక ఘట్టం!

1920 కాలంలో బ్రిటిష్ నేపథ్యంలో జరిగే ఈ కథలో ఎన్టీఆర్ కొమరం భీం, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. బ్రిటిష్ వారి పాత్రలకు విదేశీ నటీనటుల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆర్ఆర్ఆర్ మూవీలో ఐర్లాండ్ కు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటి అలిసన్ డోడి నెగిటివ్ రోల్ లో నటించబోతున్నట్లు టాక్. ఆమె వయసు 53 ఏళ్ళు. పలు హాలీవుడ్ చిత్రాల్లో అలిసన్ నటనకు రాజమౌళి ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఐర్లాండ్ కు చెందిన మరో నటుడు రేమండ్ స్టీవెన్సన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రాంచరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనితో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ పై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ సందడి బుధవారం నుంచి షురూ కానుంది.