ఆర్ఆర్ఆర్ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి అతిపెద్ద మల్టీస్టార్ మూవీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. 2020 జులై 30న విడుదల కాబోయే ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తి చూపుతున్నారు. 

ఈ చిత్రం స్వాతంత్ర సమర నేపథ్యంలో 1920 కాలంలో ఉంటుందని ఇది వరకే ప్రకటించారు. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి కథకు సంబంధించిన ఓ విషయం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. 

అల్లూరి సీతా రామరాజు 1897లో జన్మించారు. కొమరంభీం 1901లో జన్మించారు. సమకాలీనులైన వీరిద్దరూ యుక్త వయసులో అజ్ఞాతంలోకి వెళతారు. వీరిద్దరికి సంబంధం ఉన్నట్లు చరిత్రలో ఎక్కడా లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన వీరిద్దరూ స్నేహితులుగా మారితే.. అనే అంశంతో ఈ చిత్రం ఉండబోతోంది. 

ఎన్టీఆర్, రాంచరణ్ తొలిసారి ఎలా కలిశారు అనే సన్నివేశాన్ని రాజమౌళి అద్భుతమైన ట్విస్ట్ తో తెరక్కిస్తున్నారట. చరణ్, ఎన్టీఆర్ తొలిసారి ఈ చిత్రంలో కలుసుకునే సన్నివేశం ఊహకందని విధంగా ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీని ఇంకా ఖరారు చేయలేదు.