కిక్, రేసుగుర్రం లాంటి చిత్రాలకు కథలు అందించిన రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  

యంగ్ హీరో నితిన్ గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించాడు. రంగ్ దే, చెక్, మ్యాస్ట్రో చిత్రాలు గత ఏడాది విడుదలయ్యాయి. వీటిలో రంగ్ దే, మ్యాస్ట్రో చిత్రాలు పర్వాలేదనిపించగా.. చెక్ నిరాశ పరిచింది. నితిన్ సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలమే అవుతోంది. దీనితో నితిన్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. 

ప్రస్తుతం నితిన్ నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే నితిన్ మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. కిక్, రేసుగుర్రం లాంటి చిత్రాలకు కథలు అందించిన రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం కథకు సంబంధించిన తుదిదశ మెరుగులు దిద్దుతున్నాడు వక్కంతం వంశీ.ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నితిన్, వక్కంతం వంశి ఈ చిత్రానికి 'జూనియర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కథకు యాప్ట్ ఉంటుందని ఇదే టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. 

వక్కంతం వంశీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నం బెడిసి కొట్టింది. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ రూపొందించిన నా పేరు సూర్య చిత్రం నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీనితో ఈసారి ఎలాగైనా దర్శకుడిగా నిరూపించుకోవాలని వంశీ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. 

నితిన్ తో తెరక్కించబోయే ఈ చిత్రం కిక్, పోకిరి తరహాలో చిన్న మెసేజ్ ఉంటూనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.