స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఆరంభం నుంచే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఏ తరహా కథతో తెరకెక్కుతోంది అనే విషయంలో క్లారిటీ లేదు. ఫాదర్ సెంటిమెంట్ అనే ప్రచారం మాత్రం జరుగుతోంది. 

ఇదిలా ఉండగా ఈ చిత్ర టైటిల్ ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ప్రకటించనున్నారు. ఇప్పటికే 'నాన్న నేను', 'అలకనంద' అనే టైటిల్స్ ప్రచారం జరిగాయి. ఈ చిత్రానికి ఓ అచ్చతెలుగు టైటిల్ ఫిక్స్ ఐపోయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ ఈ చిత్రానికి 'వెంకటాపురంలో' అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఆగష్టు 15న తెలియనుంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా బన్నీ సరసన రెండవసారి నటిస్తోంది.