యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం ఆగష్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే సాహో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రభాస్ విన్యాసాలు చూసేందుకు ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో మేకింగ్ వీడియోలు విడుదలయ్యాయి. సాహూ చిత్రం హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ఉండబోతోందని అర్థం అవుతోంది. 

కానీ ఇంతవరకు సాహో కథలోని అంశం గురించి ఎలాంటి విషయం బయటకు రాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం సాహో చిత్రం కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో రివేంజ్ డ్రామాగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఓ అండర్ వరల్డ్ డాన్ ని అంతం చేయడానికి ప్రభాస్ నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా మారతాడు. అలా అండర్ వరల్డ్ డాన్ అనుచరులందరిని మట్టుబెడుతుంటాడు. 

ఫ్లాష్ బ్యాక్ లో ఆ డాన్ ప్రభాస్ కుటుంబ సభ్యులని, స్నేహితులని హత్య చేసి ఉంటాడు. అతడిపై ప్రతీకారం తీర్చుకుందుకే ప్రభాస్ నకిలీ ఇంటర్ పోల్ అధికారిగా మారతాడు. ఈ ఆసక్తికరమైన కథాంశంతోనే సాహో చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. వినడానికి రెగ్యులర్ స్టోరీలాగే అనిపిస్తున్నా తన స్క్రీన్ ప్లేతో సుజిత్ ఆశ్చర్యపరుస్తాడట. చిత్ర యూనిట్ మాత్రం సాహో చిత్రం రివేంజ్ డ్రామానే అని ఇంతవరకు ప్రకటించలేదు. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరక్కుతున్న ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.