సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఎక్కువగా సందేశాత్మక చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. సందేశం ఉంటూనే అభిమానులు ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకుంటున్నాడు. కానీ మహేష్ నుంచి ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఇది సరిపోదు. అందుకేనేమో మహేష్ నెక్స్ట్ మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటెర్టైనర్ గా రాబోతోంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో అనిల్ వినోదానికి పెద్ద పీటవేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా మహేష్ తదుపరి చిత్రాల గురించి కూడా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ మహేష్ బాబుతో ఓ చిత్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. మహేష్ కు స్టోరీ లైన్ చెప్పి ఒకే చేయించాడు కూడా. ప్రస్తుతం పరశురామ్ పూర్తి కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. 

ఈ చిత్ర కథ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టే బడా వ్యాపారవేత్తల అవినీతి నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందట. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినవారంటే ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ మాల్యానే. ఈ చిత్రంలో విజయ్ మాల్యా అంశాన్ని కూడా పరుశురామ్ పరోక్షంగా టచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా సీరియస్ కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. అనిల్ రావిపూడి చిత్రం ప్రారంభం అయ్యాక మహేష్, పరశురామ్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.