చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లు నమోదయ్యాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి జీవించారు. రీఎంట్రీ తర్వాత చిరంజీవి సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 152వ చిత్రానికి సమాయత్తం అవుతున్నారు. పరాజయం ఎరుగని కొరటాల శివ ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కొరటాల శివ మూవీ అంటే తప్పనిసరిగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఉండాల్సిందే. కానీ మెగాస్టార్ చిత్రానికి మాత్రం కొరటాల ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. 

ఈసారి దేవిశ్రీ కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ కోసం కొరటాల ప్రయత్నిస్తున్నాడు. ఆ మధ్యన కొందరు బాలీవుడ్ సంగీత దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసే ప్రచారం జరుగుతోంది. 

చిరు 152 చిత్రానికి మణిశర్మ సంగీతం అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని కొరటాల దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు. ఇలాంటి చిత్రానికి బ్యాగ్రౌండ్ సంగీతం చాలా కీలకం. కథకు తగ్గట్లుగా , హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో మణిశర్మకు తిరుగులేదు. 

కానీ ఇటీవల మణిశర్మ ఫామ్ ఆశించిన మేరకు లేదు. దాదాపుగా స్టార్ హీరోలంతా మణిశర్మని పక్కన పెట్టేశారు. చిరంజీవికి కూడా మణిశర్మ అభిమాన సంగీత దర్శకుడు. వీరిద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ మణిశర్మ అదిరిపోయే ఆల్బమ్స్ అందించారు. రీసెంట్ గా మణిశర్మ సంగీతం అందించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం విజయం సాధించింది. అంతగా ఫామ్ లో లేని మణిశర్మని చిరు 152వ చిత్రానికి ఎంపిక చేస్తే మెగా అభిమానులకు కాస్త టెన్షన్ తప్పదు. 

ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో నటించనున్నారు. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిపై మెగాస్టార్ పొలిటీషియన్స్ తో పోరాడే విధంగా ఈ చిత్రం ఉండబోతోంది. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. గోవింద ఆచార్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనుంది.