సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మహేష్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలవోకగా వసూళ్లు రాబడుతున్నాయి. ఈ ఏడాది మహేష్ బాబు మహర్షి చిత్రంలో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దేశభక్తి అంశాలతోపాటు, ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలతో కూడా రూపొందుతోంది. ఇక ఈ చిత్రంలో లేడి సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. విజయశాంతి పాత్రకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఉత్కంఠగా మారాయి. 

తాజాగా విజయశాంతి పాత్రకు సంబంధించిన వార్త ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో విజయశాంతి మెడికల్ ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారట. అనిల్ రావిపూడి తన పాత్రని డిజైన్ చేసిన విధానానికి విజయశాంతి ఫిదా అయ్యారట. ఆమె పాత్ర చాలా హుందాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ చిత్రంలో నటించడానికి విజయశాంతి అంగీకరించినట్లు తెలుస్తోంది. 

నటనకు చాలా ఏళ్ళు గ్యాప్ వచ్చినా విజయశాంతిలో ఇప్పటికి అదే ఎనర్జీ ఉందని ఇటీవల అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. బండ్ల గణేష్, సీనియర్ హీరోయిన్ సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాతలు.