ప్రకృతి ప్రేమికుడికి అరుదైన గౌరవం.. ఢిల్లీలో 'గ్రీన్ హార్ట్ దుశర్ల సత్యనారాయణ' డాక్యుమెంటరీ స్క్రీనింగ్
69 ఏళ్ల ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ వేత్త దుశర్ల సత్యనారాయణ గురించి వినే ఉంటారు. ఆయన సెప్టెంబర్ 23న ఢిల్లీలో అరుదైన గౌరవం దక్కనుంది.

69 ఏళ్ల ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ వేత్త దుశర్ల సత్యనారాయణ గురించి వినే ఉంటారు. ఆయన సెప్టెంబర్ 23న ఢిల్లీలో అరుదైన గౌరవం దక్కనుంది. ఆయనపై తెరకెక్కించిన డాక్యుమెంటరీ చిత్రం ' ఇండియాస్ గ్రీన్ హార్ట్ దుశర్ల సత్యనారాయణ' భారత ప్రభుత్వం నిర్వహించబోతున్న నది ఉత్సవ్ లో ప్రదర్శించనున్నారు.
నది ఉత్సవ్ మూడు రోజుల పాటు జరగనుంది. ఈ మూడురోజుల్లో ఇండియాలో తెరకెక్కిన ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రాలని ప్రదర్శించనున్నారు. సత్యనారాయణ సూర్య పేట దగ్గర్లో ఉన్న రాఘవపురంలో తన 70 ఎకరాల వ్యవసాయ భూమిలో దశాబ్దాల నుంచి అడవిని పెంచుతున్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ తాను చిన్నతనంలోనే ప్రకృతి ప్రేమికుడిగా మారినట్లు తెలిపారు.
ఈ డాక్యుమెంటరీ చిత్రం చిలుకూరి సుశీల్ రావు దర్శకత్వంలో, నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ లో ప్రదర్శించనున్నారు. డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన మాత్రమే కాక దేశం నలు మూలల నుంచి విద్యావేత్తలు, పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు సెమినార్ లో పాల్గొననున్నారు.
ఇండియాలో నదులని శుభ్రపరచడం, ప్రకృతి లాంటి అంశాలపై వీరంతా సెమినార్ లో చర్చించనున్నారు. ఇక సత్యనారాయణ నల్గొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో సురక్షిత నీటిని కూడా సరఫరా చేస్తున్నారు.