'ఇండియాస్ గాట్ టాలెంట్ -7', 'మాస్టర్ చెఫ్ ఇండియా' తదితర టీవీ షోలకు చెందిన సీనియర్ పోస్ట్ ప్రొడ్యూసర్ సోహన్ చౌహాన్ మృతి చెందారు. ఆయన మృతదేహం ముంబైలోని రాయల్ పామ్స్ సొసైటీకి చెందిన ఒక చెరువులో దొరికింది.

విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టంకి తరలించారు. సోహన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆరు నెలల క్రితమే సోహాన్ కి వివాహమైంది. అతడి భార్య ఢిల్లీలో ఉంటుండగా.. సోహాన్ ముంబైలో ఒంటరిగా ఉంటున్నారు.

సోహాన్ ని చివరిగా అతడి ఇంట్లో పనిచేసే వ్యక్తి చూశారు. జూన్ 13వరకు సోహాన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. 'సారేగామాపా' షో గురించి జూన్ 9న ఒక పోస్ట్ కూడా చేశారు. అతడి మృతదేహాన్ని చెరువులో చూసిన కొందరు విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల దర్యాప్తులో సోహాన్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేలింది. సీసీ ఫుటేజ్ లో సోహాన్ బాటిల్ తీసుకొని బిల్డింగ్ నుండి బయటకి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.