మెలోడీ మాస్టర్ - సీనియర్ సంగీత దర్శకులు ఇళయరాజా గత కొంత కాలంగా వివాదాస్పద వార్తల్లో నిలుస్తున్నారు. గురు శిష్యులుగా ఉండే ఇళయరాజా - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య మనస్పర్థలు వచ్చాయని మొన్నటి వరకు అనేక వార్తలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇళయరాజా కూడా తన పాటలను ఎవరు అనుమతి లేకుండా స్టేజ్ లపై పాడవద్దని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఆయన డిమాండ్ కు కౌంటర్ గా కోలీవుడ్ నిర్మాతలు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సైలెంట్ గా ఉన్న ఇళయరాజా ఇప్పుడు మళ్ళీ మరో వివాదంతో తెరపైకి వచ్చారు. ఆయన స్వరపరిచిన పాటలకు ఐదేళ్లుగా రాయల్టీని వసూలు చేస్తూ వస్తున్నారు. అయితే పలువురు నిర్మాతల మండలి సభ్యులు చిత్ర నిర్మాతలకు కూడా భాగం ఉంటుందని  చెబుతూ... రాయల్టీ లో సినీ నిర్మాతకు కనీసం 50% దక్కాలని కోర్టుని ఆశ్రయించారు.

పులి చిత్ర నిర్మాత పిటి సెల్వ కుమార్ , అన్పు సెల్వన్, జపజోన్స్, మీరకదిరవన్, మణికంఠన్ వంటి ప్రముఖ నిర్మాతలు మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే నిర్మాతల మండలిలో అధ్యక్షుడు విశాల్ కు సంబంధించిన ఆరోపణలు చేసిన నిర్మాతలు ఇప్పుడు ఇళయరాజా తీరుపై కోర్టును సంప్రదించడంతో తమిళ సిని పరిశ్రమ ఆశ్చర్యానికి లోనవుతోంది.