బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ గుంజన్‌ సక్సెనా. ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కరోనా కారణంగా ఓటీటీలోనే విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌లో స్థానం సంపాందించిన గుంజన్‌ సక్సెనా జీవిత కథ ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాపై ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో గుంజన్‌ పాత్రను హైలెట్‌ చేయటం కోసం ఎయిర్‌ ఫోర్స్‌ను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ ఐఏఎఫ్‌, సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది. ఈ లేఖలో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ గతంలో నెట్‌ఫ్లిక్స్‌, ధర్మా ప్రొడక్షన్స్ ఐఏఎఫ్‌ను ప్రొజెక్ట్ చేసే విషయంలో జాగ్రత్తలు వహిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్‌, గుంజన్‌ సక్సెనా పాత్రలో నటించిన ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాపై ఐఏఎఫ్‌ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.