మనం ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటోంది నటి తాప్సి. తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన తాప్సి ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

రీసెంట్ గా ఆమె నటించిన 'మన్మర్జియా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై కామెంట్స్ చేసింది. చాలా కాలంగా ఆమె డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై తాప్సి వివరణ ఇస్తూ ప్రేమలో ఉన్న మాట నిజమే కానీ పెళ్లికి మాత్రం ఇంకా సమయం ఉందని వెల్లడించింది. ''ఇప్పుడే నా పెళ్లి జరగదు. నాకు పిల్లలు కావాలని అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి ముందే పిల్లల్ని కనను. మనం ప్రేమించే వ్యక్తితో సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా..?'' అంటూ వెల్లడించింది.