బాలీవుడ్  యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మరణవార్తను సినీ పరిశ్రమ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. సుశాంత్ మృతితో సినీ ప్రముఖుల జీవితాల్లో చీకటి కోణాలు తెర మీదకు వస్తున్నాయి. అదే సమయంలో ఇండస్ట్రీలో రాజకీయాలపై కూడా రకరకాల వార్తలు తెర మీదకు వస్తున్నాయి. సుశాంత్ మృతికి నివాళిగా సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్‌ సీనియర్‌ నటి ఖుష్బూ కూడా స్పందించారు.

`ప్రతీ ఒక్కరి జీవితంలో డిప్రెషన్‌ను ఎదుర్కోవాల్సిన సందర్భం ఏదో ఒక పరిస్థితుల్లో వస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి లేదు అని ఎవరైన చెపితే అది అబద్ధమే. నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ నేను నా జీవితంలో వచ్చిన సమస్యలతో నా చెడ్డ ఆలోచనలతో పోరాడి గెలవాలని నిర్ణయించుకున్నాను. నేను వాటికన్న బలమైనదాన్ని అని ప్రూవ్ చేయాలనుకున్నాను. నన్ను ఓడించాలనుకున్న వారి కన్నా బలమైనదాన్ని అని, నా అంతం చూడాలనుకున్న వారికన్నా బలమైన దాన్ని అని ప్రూవ్‌ చేయాలనుకున్నా` అంటూ తన అనుభావాలను వెల్లడించింది ఖుష్భూ.

`నేను ఏ రోజు ఓటమికి భయపడలేదు, చీకటి ని చూసి భయపడలేదు, నన్ను చుట్టుముడుతున్న సమస్యలను చూసి భయపడలేదు. అయితే నేను డిప్రెషన్‌లో ఉన్న సమయంలో నా స్నేహితులు నన్ను ఆదుకున్నారు. వారి ఇచ్చిన ధైర్యం కారణంగానే కోలుకోగలిగాను. ఇప్పుడు పరాజయాల్ని విజయాలుగా మార్చుకొని ఈ స్థాయికి వచ్చాను` అంటూ చెప్పుకొచ్చింది ఖుష్భూ.