లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి జీవితం తెరపైకి తేవాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే శ్రీదేవి బయోపిక్ కి తాను వ్యతిరేకం అంటున్నాడు భర్త బోనీ కపూర్. ఎప్పటికీ శ్రీదేవి జీవితం తెరపైకి తీసుకురాను అంటున్నారు.  

బాల నటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి హీరోయిన్ అయ్యాక వెండితెరను ఏలింది. తిరుగులేని స్టార్డమ్ తో ప్రేక్షకులను ఓలలాడించింది. శ్రీదేవి అంటే అందం, అభినయం, నాట్యం. అన్నీ కలబోసి రూపొందించిన అతిలోక సుందరి. సౌత్ నుండి నార్త్ కి వెళ్లి అక్కడ మరిన్ని సంచలనాలు చేసింది. బాలీవుడ్ ని ఏలిన సౌత్ ఇండియన్ బ్యూటీగా శ్రీదేవి కీర్తి స్థిరస్థాయిగా నిలిచిపోయింది. చివరి శ్వాస వరకు సినిమానే ప్రాణంగా ఆమె జీవించారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్ లో ప్రమాదవశాత్తు ఆమె కన్నుమూసింది. శ్రీదేవి మరణించి ఆరేళ్ళు అయ్యింది. ఆమె జీవితం వెండితెరపైకి తేవాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. శ్రీదేవి జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, వివాదాలు ఉన్నాయి. కమల్ హాసన్ ని ఆమె వివాహం చేసుకోవాలి అనుకున్నారట. అలాగే నటుడు మిథున్ చక్రవర్తితో శ్రీదేవి వివాహం జరిగిందనే పుకారు ఉంది. ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవిని తాను రహస్యంగా వివాహం చేసుకున్నానని మిథున్ చక్రవర్తి చెప్పడం కొసమెరుపు. 

ఆమె మరణం కూడా ఒక మిస్టరీనే. కాబట్టి సినిమాకు కావలసిన నాటకీయత శ్రీదేవి జీవితంలో చోటు చేసుకుంది. ఆమె బయోపిక్ కి విపరీతమైన డిమాండ్, హైప్ ఉంది. కానీ బోనీ కపూర్ అందుకు ఒప్పుకోవడం లేదు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి ఆయన స్పష్టం చేశారు. ఆయన నిర్మాతగా ఉన్న మైదాన్ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న బోనీ కపూర్ ని శ్రీదేవి బయోపిక్ గురించి విలేకరులు అడిగారు. 

బోనీ కపూర్ మాట్లాడుతూ... శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె జీవితం కూడా ప్రైవేట్ గానే ఉండాలి. కాబట్టి నేను బ్రతికి ఉన్నంత వరకు శ్రీదేవి బయోపిక్ కి అనుమతి ఇవ్వను, అన్నారు. బోనీ కపూర్ స్టేట్మెంట్ ఒకింత శ్రీదేవి అభిమానులను నిరాశపరిచే విషయమే. కాగా గతంలో శ్రీదేవి బంగ్లా పేరుతో ఓ మూవీ తెరకెక్కింది. ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఆ చిత్ర ట్రైలర్ సంచలనం రేపింది. 

శ్రీదేవి బంగ్లా ట్రైలర్ చూసిన బోనీ కపూర్ చిత్ర విడుదలను అడ్డుకున్నాడు. ఆ మూవీ శ్రీదేవి జీవితానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఆయన లీగల్ యాక్షన్ తీసుకున్నారు. శ్రీదేవి బంగ్లా మూవీ వివాదాలతో ఆగిపోయింది.