తమిళ నిర్మాతల మండలిలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదంతో పోలీసులు నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

తమిళ నిర్మాతల మండలిలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదంతో పోలీసులు నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వివాదం మరింత రాజుకుంది. ఈ విషయంలో విశాల్ మద్రాస్ హైకోర్టుని సంప్రదించగా కోర్టు విశాల్ కి మద్దతుగా తీర్పునిచ్చింది.

నిర్మాతల మండలి కార్యాలయానికి అసమ్మతి వర్గం సభ్యులు వేసిన తాళాన్ని, రెవెన్యూ అధికారులు వేసిన తాళాన్ని తీసివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాతల మండలిలో ఏడు కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఓ వర్గం ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో నిర్మాతల మండలికి తాళం వేసింది.

దీంతో ఆ తాళాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాడు విశాల్. దీంతో పోలీసులు అడ్డుకొని అతడిని అరెస్ట్ చేశారు. అదే సమయంలో నిర్మాతల మండలిలో నెలకొన్న తగాదాలను ప్రస్తావిస్తూ గిండి తహసీల్దార్ నిర్మాతల మండలి ఆఫీసుకి సీలు వేయడంపై విశాల్ హైకోర్టుని ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు నిర్మాతల మండలికి వేసిన సీలు తొలగించాలని, ఎన్ని వివాదాలున్నా అధ్యక్షుడి హోదాలో ఉన్న విశాల్ నిర్మాతల మండలి లోకి వెళ్లే హక్కు ఉంటుందని దాన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదని అన్నారు.

విశాల్ ని అరెస్ట్ చేసినందుకు పోలీసుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విశాల్ ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ పోలీసులను నిలదీసింది. వివాదాలు జరిగినప్పుడు పరిస్థితులను పోలీసులు కంట్రోల్ చేయాలే తప్ప మరింత పెద్దవి చేయకూడదని సూచించింది!