దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచాడు రాజమౌళి. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ గా 'బాహుబలి.. బిఫోర్ ది బిగినింగ్' పేరుతో వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఆర్కా మీడియా, రాజమౌళి ఈ వెబ్ సిరీస్ కి సహా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 'ది రైజ్ ఆఫ్ శివగామి' అనే పాపులర్ బుక్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. టాలీవుడ్ దర్శకులు ప్రవీణ్ సత్తారు, దేవకట్టా ఈ వెబ్ సిరీస్ కి దర్శకులుగా వ్యవహరించనున్నారు. 

ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ముప్పై ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.10 కోట్లు బడ్జెట్ కేటాయించనున్నారట. దీంతో పాటు దర్శకులకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సినిమాల కోసం వీరు తీసుకునే రెమ్యునరేషన్ కి మించి ఇవ్వనున్నారట.

ప్రవీణ్ సత్తారు కెరీర్ లో మంచి హిట్స్ ఉన్నా.. స్టార్ లీగ్ లోకి మాత్రం చేరలేకపోయాడు. మరోపక్క దేవకట్టాని తెలుగు ఆడియన్స్ మర్చిపోయి చాలా కాలం అవుతుంది. ఈ క్రమంలో దేవకట్టాకి ఈ ఆఫర్ రావడం విశేషమనే చెప్పాలి. పైగా ఈ వెబ్ సిరీస్ ని వివిధ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తారు కాబట్టి ఈ ఇద్దరు దర్శకుల పాపులారిటీ పెరగడం ఖాయమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.